నటుడు ఉపేంద్ర సినిమాలలో కొత్త కొత్త ప్రయోగాలతో ఆకట్టుకుంటూ, నిజ జీవితంలోనూ విలక్షణంగా ప్రవర్తిస్తూ అభిమానులను అలరిస్తుంటారు. నా నాలుకకు– మెదడుకు మధ్య ఫిల్టర్ లేదు, ఏది అనుకుంటే అది మాట్లాడడం నా నైజం అని ఒక సినిమాలో డైలాగ్ చెప్పారు. అదే మాదిరిగా ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడి ఇబ్బందుల పాలయ్యారు.
కర్ణాటక : వివాదాస్పద వ్యాఖ్యలపై తనపై రెండు చోట్ల నమోదైన కేసులను రద్దు చేయాలని ప్రముఖ నటుడు, దర్శకుడు ఉపేంద్ర హైకోర్టు మెట్లెక్కారు. మరోవైపు రాష్ట్రంలో వివిధ చోట్లలో ఆయనపై పలు సంఘాలవారు ఫిర్యాదులు చేస్తున్నారు. బెంగళూరులో రెండుచోట్ల ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా మండ్య, కోలారులో కూడా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి ఉప్పికి వ్యతిరేకంగా ధర్నాలు కూడా జరిగాయి. శనివారం రాత్రి ఫేస్‌బుక్/ ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతూ ఉపేంద్ర ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్నది అభియోగం. దీనిపై పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉపేంద్ర క్షమాపణలు కోరారు. సోమవారం ట్విటర్ ఖాతాను లాక్ చేసుకొన్నారు. ఆయన ప్రస్తుతం యూఐ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఉపేంద్ర ఇళ్లు, వాట్సాప్‌లకు నోటీసులు
మొదట చెన్నమ్మ అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు రాగా, వారు విచారణ కోసం ఉపేంద్రకు నోటీస్ ఇవ్వగానే ఆయన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారని తెలిసింది. వేరేవారి ద్వారా ఉపేంద్రను పోలీసులు సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఉపేంద్రకు చెందిన రెండు ఇళ్లు, మొబైల్ వాట్సాప్‌లకు నోటీస్‌లు పంపినట్లు పోలీసులు తెలిపారు. విచారణకు రావాలని బెంగళూరులోని ఉపేంద్ర ఇంటికి పోలీసులు వెళ్లగా ఆయన లేరని తెలిసింది. హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కూడా ఏసీపీ వీవీ పురానికి బదిలీ చేశారు.
ఉపేంద్రకు ఇది తగదు: మంత్రి
యశవంతపుర: పేదరికం వేరు, కుల అసమానతలు వేరు, ఇలాంటి విషయాలను తెలుసుకోకుండా నటుడు ఉపేంద్ర మాట్లాడటం మంచిది కాదని సామాజిక సంక్షేమ మంత్రి మహదేవప్ప అన్నారు. ఉపేంద్ర వ్యాఖ్యలపై మొదట ఈ శాఖ అధికారులు బెంగళూరులో ఫిర్యాదు చేయడం తెలిసిందే. మంత్రి స్పందిస్తూ రాజకీయ జీవనం ద్వారా ప్రజలకు సేవ చేయాలని ఉన్నవారు ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా కూడా జాతి పేరుతో అవమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపేంద్ర హొలగేరి అనే పదాన్ని ఉపయోగించడమే తప్పు అన్నారు.
హైకోర్టులో ఉపశమనం
చిక్కుముడి బిగుసుకుంటోందని తెలిసి ఉపేంద్ర హైకోర్టులో పిటిషన్ వేసి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని అభ్యర్థించారు. ఉపేంద్ర అన్ని వర్గాలను గౌరవించే మంచి మనిషి. హొలగేరి అనే నానుడిని మామూలుగా వాడారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం ఆయనకు లేదు అని ఉప్పి న్యాయవాది పేర్కొన్నారు. వాదనలను ఆలకించిన జడ్జి జస్టిస్ హేమంత్ చందనగౌడర్.. ఎఫ్‌ఐఆర్‌పై స్టే విధించారు. సర్కారుకు, ఇతర పక్షాలకు వైఖరి తెలపాలని నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment