బనశంకరి: విమానంలో వచ్చి బెంగళూరులో దిగుతారు. వస్త్ర దుకాణాల్లో షాపింగ్ పేరుతో ఖరీదైన చీరలను చోరీ చేసి వచ్చిన దారినే వెళతారు. ఇటువంటి ఖతర్నాక్ కిలేడీ ముఠాను ఆదివారం అశోక్‌నగర పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితులు గుంటూరు జిల్లాకు చెందిన రమణి, రత్నాలు, చుక్కమ్మ. వీరు ఏపీ నుంచి విమానంలో బెంగళూరుకు వచ్చి స్కార్పియో కారులో బెంగళూరులో సంచరించేవారు.
ఇలా చీరల తస్కరణ
చీరల దుకాణాల్లో కొనుగోలు చేసే నెపంతో సిబ్బంది కళ్లుగప్పి విలువైన చీరలను మాయం చేయడంలో ఆరితేరినవారని పోలీసులు తెలిపారు. శ్రీమంతుల తరహాలో ఒంటినిండా బంగారు నగలు ధరించి షాపులకు వెళ్లి లక్షల విలువైన చీరలను చూపించాలని సిబ్బందిని అడిగేవారు. మరిన్ని చీరలను చూపించాలని కోరేవారు, చీరలను తేవడానికి సిబ్బంది షాపు లోపల స్టోర్‌రూమ్‌లోకి వెళ్లిన సమయంలో కిలేడీలు చీరలు బండిల్స్‌ను దాచుకుని అక్కడ నుంచి వెళ్లిపోయేవారు.
ఇలా వెళ్తున్న ఓ మహిళ కాలి వద్ద చీర ఉన్నట్లు షాపు సెక్యూరిటీ గమనించి యజమానికి తెలిపాడు, తరువాత సీసీ కెమెరాలు పరిశీలించగా మహిళల లాఘవం వెలుగులోకి వచ్చింది. ఫుటేజీలతో సహా అశోకనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని ఆదివారం లేడీ గ్యాంగ్ ను అరెస్ట్‌చేసిన అశోకనగర పోలీసులు వీరి వద్ద నుంచి రూ.14 లక్షల విలువ చేసే చీరలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment