నూతన దంపతులతో సీఎం సిద్దరామయ్య
మైసూరు: వ్యవసాయం పేరిట అప్పులు చేసి ఆ సొమ్ముతో ఘనంగా పెళ్లిళ్లు చేసుకోవడం నిలిపేయాలని సీఎం సిద్ధరామయ్య సూచించారు. పేదలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోకూడదని, ఎంత మంచం ఉంటే అంతలోనే కాళ్లు చాపుకోవాలని హితవు పలికారు. బుధవారం చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని శ్రీ మలై మహదేశ్వరబెట్ట దేవస్థానంలో ఏర్పాటు చేసిన సామూహిక వివాహోత్సవంలో సిద్ధరామయ్య పాల్గొని మాట్లాడారు. పేదలు, మధ్యతరగతి వారు అప్పులు చేసి ఘనంగా పెళ్లిళ్లు చేసుకుని జీవితాంతం ఆ అప్పులు తీర్చుకుంటూ ఉంటున్నారని, ఇది సరికాదని సూచించారు. నూతన దంపతులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. మలై మహదేశ్వర బెట్టలో ఉన్న రాష్ట్రపతి భవన్‌ను ఇకనుంచి తపోభవనం అని పిలవాలని సూచించారు.
మాదప్పకు సీఎం పూజలు
మలె మహదేశ్వర స్వామిని సీఎం దర్శనం చేసుకున్నారు. దండిగా వర్షాలు కురిపించి కరువు, కావేరి వివాదం నుంచి గట్టెక్కించాలని పూజలు చేసినట్లు తెలిపారు. సుమారు 20 నిమిషాల పాటు వీరు స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
కావేరిపై సుప్రీంను ఆశ్రయిస్తాం
తమిళనాడుకు మరో 15 రోజుల పాటు రోజూ 3 వేల క్యూసెక్కుల కావేరి నీటిని విడుదల చేయాల్సి ఉందని, దీన్ని ప్రశ్నిస్తు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటప్పుడు నీటిని వదలాలనే నిర్ణయం సరికాదని అన్నారు. చామరాజనగరకు వచ్చిన సీఎం కొన్నినెలల్లోనే పదవిని పోగొట్టుకుంటారనే ప్రచారాన్ని ప్రస్తావించగా, గతంలో చామరాజనగరకు వచ్చి ఐదేళ్ల పాటు పాలన సాగించామని, ఈ అపవాదును తొలగించామని సీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment