బాలుని వెంట బాపూజీ... బెంగళూరు గాంధీభవన్ ఆవరణలో ఉన్న విగ్రహం
కర్ణాటక: నిరాడంబరత, అహింస ద్వారా మహాత్మాగాంధీ యావత్ ప్రపంచానికే ఆదర్శనీయులయ్యారు. కాలగమనంలో కొన్ని సిద్ధాంతాలు పాతబడతాయి. కొందరు ప్రముఖులు కనుమరుగవుతారు. అయితే ఆయన మాత్రం జాతిపితగా గౌరవాన్ని అందుకుంటున్నారు. దేశాన్ని తెల్లదొరల దాస్యశృంఖలాల నుంచి విముక్తి కల్పించిన పోరాటంలో గాంధీ పాత్ర ఎనలేనిది. అలాగే కర్ణాటకకు గాంధీజీతో ఎనలేని అనుబంధం ఉంది.
పాడుబడిన గాంధీ బావి
1934లో మొట్టమొదటి సారిగా బెంగళూరుకు వచ్చిన మహాత్మాగాంధీ కెంగేరి ప్రాంతాన్ని సందర్శించారు. అంటరానితనంపై పోరాటంలో భాగంగా కెంగేరిలోని ఓ హరిజన వాడను సందర్శించారు. ఆ ప్రాంతంలోని గ్రామ సేవా కేంద్రంవారు తవ్విన ఓ బావిని ఆయన ఈ పర్యటనలో ప్రారంభించారు. బావిలోని నీటిని ఓ వెండి చెంబుతో తోడి వాటిని అక్కడే ఉన్న దళితులకు అందించారు. అప్పటి నుంచి ఆ బావిని గాంధీ బావిగా పిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎటువంటి సంరక్షణ లేక ఆ బావి పాడుబడింది.
సమరయోధుల మొర
గాంధీ పర్యటించిన స్థలాలు, భవనాలను భావితరాల కోసం కాపాడుకోవాలి. కానీ పాలకుల నిర్లక్ష్యంతో పాడుబడిపోతున్నాయని పలువురు స్వాతంత్య్ర సమరయోధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాపూజీ జ్ఞాపకాలను కాపాడుకోవడానికి ఇప్పటికై నా చొరవ చూపాలని సూచించారు.
1934లో మొదటిసారి రాక
1934లో గాంధీజీ మొట్టమొదటిసారిగా ఉద్యాన నగరాన్ని సందర్శించారు. తరువాత 18 సార్లు రాష్ట్రాన్ని సందర్శిస్తే అందులో 14 సార్లు నగరానికి వచ్చారు. ఆయన బెంగళూరులో అనేక ప్రాంతాలలో సభలు, సమాలోచనలు జరిపారు. అయితే ఆ ప్రాంతాలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. జాతిపిత జ్ఞాపకాలను స్మారక స్థలాలుగా అభివృద్ధి చేయాల్సింది పోయి అవి పాడుబడుతున్నా పట్టించుకోవడం లేదు.
జాతిపిత నడయాడిన చోట వినోద క్లబ్‌లు!
మద్యపానం మంచిది కాదని పోరాటాన్ని సాగించిన మహాత్ముడు నడిచిన చోటనే ఇప్పుడు విలాసవంత క్లబ్‌లు వెలిశాయి. ఇందులో ఎప్పుడూ మద్యం పొంగుతూ, జూదం సాగుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. మహాత్ముడు మల్లేశ్వరంలో అనేకసార్లు స్వాతంత్య్ర పోరాట సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు ఇక్కడే ఓ క్లబ్ ఏర్పాటైంది. నందీ హిల్స్‌లో గాంధీజీ మూడు నెలల పాటు గడిపారు. ఆ ప్రాంతంలో కూడా ప్రస్తుతం ఓ క్లబ్ నడుస్తోంది. ప్రార్థనలు నిర్వహించిన కుమార పార్క్‌లో ప్రస్తుతం ఓ ఫైవ్‌స్టార్ హోటల్ వెలసింది.
Comments
Please login to add a commentAdd a comment