![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/14/565656656.jpg.webp?itok=sAgV2lcz)
కర్ణాటక: బెంగళూరు శివార్లలో పరువు హత్య చోటుచేసుకుంది. కుమార్తె ప్రియునితో తరచూ ఫోన్లో మాట్లాడడం చూసి కోపగ్రస్తుడైన ఓ తండ్రి ఆమె నిద్రిస్తుండగా గొంతుకోసి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ సంఘటన బెంగళూరు రూరల్‌లోని దేవనహళ్లి తాలూకా బిదలూరు గ్రామంలో చోటుచేసుకుంది.
చిన్న కూతురి ప్రేమ గొడవ..
వివరాలు... కవన (20) హత్యకు గురైన యువతి. మంజునాథ్ (47) ఆమె తండ్రి. కవన డిగ్రీ చదువుతున్నట్లు సమాచారం. చికెన్ షాపు నిర్వహించే మంజునాథ్‌కు ముగ్గురు కుమార్తెలు. ఇటీవలే చిన్న కుమార్తె వేరే కులానికి చెందిన యువకున్ని ప్రేమించి అతనితో వెళ్లిపోయింది. చివరకు పోలీసు స్టేషన్‌లో పంచాయతీ జరిగింది. తాను ప్రియునితోనే ఉంటానని చిన్న కూతురు తెగేసి చెప్పింది. ఈ సంఘటనతో మంజునాథ్ మానసికంగా కృంగిపోయాడు.
అదే బాటలో పెద్దకుమార్తె
ఇంతలోనే పెద్ద కుమార్తె కవన ప్రేమలో పడినట్లు తెలుసుకున్నాడు. తల్లిండ్రుల ముందే ఆ యువకునితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది, ఇది మంచి పద్ధతి కాదని తల్లిదండ్రులు బుద్ధిమాటలు చెబితే పట్టించుకోలేదు. చిన్న కుమార్తెలాగా ఇంటి మర్యాద తీస్తుందని ఆందోళన చెందిన మంజునాథ్ బుధవారం రాత్రి కవన ఇంట్లో నిద్రిస్తుండగా చాకుతో గొంతుకోసి, ఆపై తల, చేతులు, కాళ్లపై విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. తరువాత విశ్వనాథపుర పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఇంటికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
హత్యకు ముందు గొడవ
కవన ప్రియుడు వేరే కులం వాడని, అతనితో సంబంధం వద్దని తండ్రి అనేకసార్లు కూతురుతో గొడవపడ్డాడని గ్రామస్తులు తెలిపారు. బుధవారం రాత్రి కూడా తండ్రీ కూతురు ఘర్షణ పడ్డారని చెప్పారు. ఈ పరిణామాలతో అతడు ఉన్మాదిగా మారి ఉంటాడని అన్నారు. గురువారం ఉదయాన్నే ఘటన గురించి తెలిసి వందలాది మంది అక్కడకు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment