సంక్షోభంలో శాండల్‌వుడ్‌ | - | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో శాండల్‌వుడ్‌

Published Mon, Jun 17 2024 12:58 AM | Last Updated on Mon, Jun 17 2024 12:23 PM

-

అడుగుతప్పి అథః పాతాళానికి

తీవ్ర వివాదాల్లో నటీనటులు

ఈ ఏడాది పెద్ద హిట్లు కరువు

గత వైభవం అడియాసేనా?

సాక్షి, బెంగళూరు: కన్నడ చలనచిత్ర పరిశ్రమ శాండల్‌వుడ్‌ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు ప్రేక్షకులు థియేటర్లకు ముఖం చాటేస్తుండడంతో వాటిని మూసేయాల్సిన దుస్థితి తలెత్తింది. మరోవైపు నటీనటుల జీవితాల్లో సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. హీరో హీరోయిన్లే కాకుండా కొన్ని సినీ నిర్మాణ సంస్థలు, నిర్మాతలు పలు వివాదాల్లో చిక్కుకుంటూ శాండల్‌వుడ్‌కు ఏమైంది అనేలా తయారయ్యారు. హత్యలు, విడాకులు, కుమ్ములాటలతో చందనసీమ నలిగిపోతోంది. ఒకప్పుడు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌, రెబెల్‌ స్టార్‌ అంబరీష్‌, సాహససింహ విష్ణువర్ధన్‌, శంకర్‌నాగ్‌ వంటి మహామహులతో విరాజిల్లిన శాండల్‌వుడ్‌ ఇప్పుడు సంక్షోభాన్నే చవిచూస్తోంది.

థియేటర్లు వెలవెల
ఈ ఏడాది ప్రారంభం నుంచి కన్నడ కళాకారులు, సాంకేతిక నిపుణులు వ్యక్తిగత జీవితాలతో పాటు అనేక నెగెటివ్‌ వార్తలతో చిత్రపరిశ్రమ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గడిచిన ఆరునెలల్లో వందకు పైగా సినిమాలు విడుదల కాగా అందులో భారీ స్థాయిలో హిట్‌ అయిన సినిమా ఒక్కటీ లేకపోవడం చందనవనాన్ని కలవరపరుస్తోంది. అంతేకాకుండా నేటితరం ప్రేక్షకులు థియేటర్లకే రావడం లేదు. అలాగే సినిమాలను ఏ టీవీ చానెల్‌ కానీ, ఓటీటీ సంస్థలు కానీ కొనుగోలు చేయడం లేదని కన్నడ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులి మీద పుట్రలా దర్శన్‌ వంటి బడా హీరోలు హత్య కేసుల్లో ఇరుక్కోవడంతో చిత్రపరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య కేసులో చాలెంజింగ్‌ స్టార్‌, నటుడు దర్శన్‌, నటి పవిత్ర, మరో 12 మందికి పైగా అనుచరులు అరెస్టు అయ్యారు. ఒక స్టార్‌ నటుడు హత్య కేసులో భాగం కావడం ఇంతవరకు జరగలేదు.

గోవాలో నిర్మాతల గొడవ
ఇటీవల కన్నడ ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు ఎన్‌ఎం సురేశ్‌తో పాటు తదితర చిత్రరంగ ముఖ్యులు గోవాకు వెళ్లారు. కొందరు అక్కడ గొడవ పడ్డారు. ఈ గొడవలో నిర్మాత గణేశ్‌పై దాడి కూడా జరిగింది.

కాపురాల్లో కలతలు
శాండల్‌వుడ్‌లోని ప్రముఖులు ఇటీవల ఒక్కొక్కరే విడాకుల పేరుతో రచ్చకెక్కుతున్నారు. రియాల్టీ షో కలసికట్టుగా కనిపించిన చందన్‌ శెట్టి–నివేదిత ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ చకచకా తమ నిజజీవితంలో అడుగులు వేశారు. అయితే మూణ్నాళ్ల ముచ్చటే అన్నట్లు పెళ్లి అయిన మూడేళ్లకే వీరిద్దరూ విడిపోతామని కోర్టును ఆశ్రయించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇద్దరికీ పొసగక విడాకులకు సిద్ధమయ్యారు. కన్నడ కంఠీరవ దివంగత నటుడు డాక్టర్‌ రాజ్‌కుమార్‌ కుటుంబంలో కూడా విడాకుల ఉదంతం వెలుగు చూసింది. 

కొన్నేళ్ల క్రితం ప్రేమించి, ఇంట్లో పెద్దలను ఒప్పించి యువ రాజ్‌కుమార్‌, శ్రీదేవీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య కలతలు రావడంతో విడిపోతామని శ్రీదేవి ప్రకటించింది. శాండల్‌వుడ్‌లో పెద్ద ఇంటిగా పేరుగాంచిన రాజ్‌కుమార్‌ కుటుంబంలో విడాకుల పేరు వినిపించడం కలకలం రేపింది. మరో స్టార్‌ నటుడు దునియా విజయ్‌ సంసారంలో కూడా అలజడులతో సాగుతోంది. ఇటీవల ఆయన దాఖలు చేసిన విడాకులు కేసును న్యాయస్థానం కొట్టివేసింది. మొదటి భార్య నాగరత్నకు విడాకులు ఇవ్వకుండానే కీర్తి గౌడను దునియా విజయ్‌ మరో పెళ్లి చేసుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement