నటుడు యశస్ సూర్యకు పోలీసుల నోటీసు
ఆ రోజు పబ్‌లో దర్శన్‌తో విందు
దొడ్డబళ్లాపురం/ యశవంతపుర/ మైసూరు: చిత్రదుర్గకు చెందిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతూ కొత్త కొత్త ముఖాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కామాక్షిపాళ్య పోలీసులు మరో నటునికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే కమెడియన్ చిక్కణ్ణకు నోటీసులు ఇచ్చి బెంగళూరులోని స్టోని బ్రూక్ పబ్‌లో మహజర్‌కు తీసికెళ్లారు. నటుడు యశస్ సూర్యకు కూడా విచారణకు హాజరవ్వాలని సూచించారు. హత్య జరిగిన రోజు స్టోని బ్రూక్ పబ్‌లో హీరో దర్శన్‌తో పాటు యశస్ విందులో పాల్గొన్నాడని తెలియడమే దీనికి కారణం. కాగా, పోలీసుల అదుపులో ఉన్న నటి పవిత్రగౌడ మంగళవారం అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిసింది.
మైసూరు హోటల్‌లో మహజరు
హీరో దర్శన్ పర్సనల్ మేనేజర్ నాగరాజు, కారు డ్రైవర్ లక్ష్మణ్‌ను మంగళవారం పోలీసులు మైసూరుకు తీసుకువచ్చి స్థల పరీశీలన జరిపారు. బెంగళూరు నుంచి పోలీసు వ్యాన్‌లో వారిని మైసూరులోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌కు తీసుకువచ్చారు. హత్య సమయంలో నటుడు దర్శన్ మైసూరులో ఇదే హోటల్లో ఉంటూ లలిత మహల్‌లో జరుగుతున్న డెవిల్ సినిమా షూటింగ్‌లో పాల్గొనేవాడు. కువెంపు నగరలో ఉన్న గోల్డ్ జిమ్‌కు కూడా వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో హత్య గురించి ఇక్కడ చర్చించారా అని నిందితులతో హోటల్, దర్శన్ సంచరించిన ప్రాంతాల్లో విచారణ జరిపారు. తరువాత టి.నరిసిపుర రోడ్డులో ఉన్న దర్శన్ ఫాంహౌస్‌కు తీసుకెళ్లారు.
పకడ్బందీగా దర్యాప్తు: కమిషనర్
రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు కాస్త ఏమరుపాటుగా ఉన్నా కేసు దారి తప్పేదని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ అన్నారు. కేసులో ఇప్పటివరకూ దర్శన్‌తో కలిపి మొత్తం 17మందిని అరెస్టు చేసి అన్ని కోణాల్లో విచారణ జరిపామన్నారు. కేసులో సాక్ష్యాధారాలను టెక్నాలజీ సాయంతో సేకరిస్తున్నట్లు చెప్పారు. ఫోరెన్సిక్, టెక్నాలజీ, చట్టపర సలహాలు తీసుకుని ముందుకు పోతున్నామన్నారు.
మళ్లీ బాతుల కేసు
మైసూరు సమీపంలో టి.నరిసిపుర రోడ్డులోని దర్శన్ ఫాంహౌస్‌లో అరుదైన బార్ హెడెడ్ గూస్ అనే అరుదైన జాతి బాతులు కొన్ని ఉన్నాయి. వీటిని పెంచుకోవడం నిషిద్ధం కావడంతో అటవీ సిబ్బంది గతంలో దర్శన్ దంపతులు, వారి మేనేజర్ నాగరాజుపైన కేసులు పెట్టారు. దీనిపై త్వరలో విచారణ చేపట్టనున్నారు.
ఎవరు చేసినా నేరమే: ఉమాపతి
దర్శన్ వ్యవహారంపై నిర్మాత ఉమాపతి స్పందిస్తూ హత్య చేయడం నేరం. అది ఎవరూ చేసినా తప్పే. అలాంటి వ్యక్తికి శిక్ష పడాలి. నాకు తెలిసినంత వరకు మృతుడు రేణుకాస్వామి వదిలేయాలని ఎంత వేడుకున్నా వదలకుండా చంపేశారని తెలిసింది. రేణుకాస్వామి భార్య గురించి ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితి. దర్శన్ అభిమానినే హత్య చేయటం ఎంతవరకు న్యాయం అని ఉమాపతి ప్రశ్నించారు. దర్శన్ దేవుడంత మనిషి అయినా కుక్క బుద్ధి కలవాడు అని విమర్శించారు.
నటుల పాత్ర ఉంటే కేసు పెడతాం: హోంమంత్రి
హత్య కేసులో దర్శన్‌తో పాటు ఇతర నటుల పాత్ర ఉందని తేలితే కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని హోంమంత్రి జీ. పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరు సదాశివనగరలో నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, దర్శన్ ఒక నటుడు కాబట్టి సహజంగానే అతడితో అనేకమంది నటులు కలిసి తిరుగుతుంటారని అంత మాత్రాన వారందరినీ అనుమానంతో చూడలేమన్నారు. త్వరలో రేణుకాస్వామి కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తానన్నారు. ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీ చివరిదశలో ఉందన్నారు. ఇంధన ధరల గురించి ధర్నాలు చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం 14 సార్లు ధరలు పెంచిన సంగతి మర్చిపోయిందా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment