దర్శన్‌పై ద్వేషం లేదు
దొడ్డబళ్లాపురం: నటుడు దర్శన్ తన ఇంటికి వస్తే భోజనం పెడతానని చెప్పి రేణుకాస్వామి తండ్రి పెద్ద మనసు చాటుకున్నారు. రేణుకాస్వామిని హత్య చేశారని హీరో దర్శన్, నటి పవిత్రగౌడ, అనుచరులను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. తండ్రి కాశీనాథయ్య మాట్లాడుతూ దర్శన్ విడుదల అయ్యాక తన ఇంటికి వస్తే భోజనం పెడతానని, తాము జంగమ సామాజికవర్గం వారమని, ద్వేషం, అసూయ వంటివి ఉండవన్నారు. చట్ట ప్రకారం తమకు న్యాయం కావాలన్నారు. దర్శన్ భార్య విజయలక్ష్మి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి ఏం మాట్లాడారు అనే సంగతి తమకు అనవసరమని అన్నారు.
కొల్లూరులో దర్శన్ భార్య పూజలు
జైలులో ఉన్న దర్శన్ ఆరోగ్యం బాగుండాలని, త్వరగా విడుదల కావాలని కోరుతూ భార్య విజయలక్ష్మి ఇప్పుడు ఆలయాలకు వెళ్తున్నారు. కుందాపుర సమీపంలోని కొల్లూరు మూకాంబిక దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేయించారు. నవ చండికా హోమం జరిపించారు.
తండ్రికి వినోద్‌రాజ్ పరామర్శ
రేణుకాస్వామి కుటుంబానికి వచ్చిన కష్టం చూసి ఎంతో ఆవేదన కలుగుతోందని నటుడు వినోద్‌రాజ్ అన్నారు. రేణుకాస్వామి తండ్రి, ఆయన కుటుంబాన్ని వినోద్‌రాజ్ చిత్రదుర్గకు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇంటికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం వీధినపడుతుందని, ఆ లోటును భగవంతుడు కూడా తీర్చలేడన్నారు. కుటుంబానికి ఆయన రూ. లక్ష సాయం అందించారు. గత వారం వినోద్‌రాజ్ పరప్పన జైలులో ఉన్న దర్శన్‌ను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment