
బొమ్మనహళ్లి: రబ్బర్ బెలూన్‌తో ఆడుకుంటున్న బాలుడు పొరపాటున గొంతులో ఇరుక్కుని విగతజీవి అయ్యాడు. ఈ విషాద సంఘటన ఉత్తర కన్నడ జిల్లాలోని హళియాళ తాలూకాలోని జోగనకొప్ప గ్రామంలో జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదివే నివిన్ నారాయణ బెళగావ్‌కర (13), ఆదివారం కావడంతో ఇంటిలో బెలూన్లతో ఆడుకుంటున్నాడు.
బెలూన్‌లోకి గాలి ఊదుతుండగా అనుకోకుండా గొంతులోకి ఇరుక్కుంది. దీంతో బాలుడు ఊపిరి ఆడక సతమతం అయ్యాడు, వెంటనే కుటుంబ సభ్యులు హళియాళ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తున్న సమయంలోనే మరణించాడు. వైద్యులు ఆపరేషన్ చేసి గొంతులో నుంచి బెలూన్ తీసివేశారు గానీ బాలుని ప్రాణం దక్కలేదు. కళ్ల ముందు ఆడుకుంటున్న చిన్నారికి అప్పుడే వందేళ్లు నిండాయా అని తల్లిదండ్రులు రోదించారు. హళియాళ పోలీసులు కేసు నమోదు చేశారు.