హుబ్లీ: జనన మరణ ధ్రువీకరణ పత్రాల ఫీజు(శుల్కం)ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 4న ఆదేశాలను ఇచ్చింది. గతంలో కేవలం రూ.5గా ఉన్న ఈ సదరు పత్రాల శుల్కాన్ని ప్రస్తుతం రూ.50లకు పెంచడంతో సాధారణ ప్రజలకు కాసింత భారం అయింది. జనన–మరణ పత్రాలు అందరికీ చాలా అవసరం. పిల్లలను పాఠశాలలో చేర్పించడం, ఆధార్ కార్డు నమోదు తదితరాలకు జనన పత్రం కావాల్సిందే. ఇక తమ వారు ఎవరైనా మృతి చెందితే ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ఇన్సూరెస్సులు తదితరాలకు మరణాల ప్రమాణపత్రం తప్పనిసరి. దీంతో ప్రజలు గ్రామ పంచాయతీ, రెవెన్యూ శాఖ కార్యాలయం తదితర స్థానిక సంస్థల ద్వారా వీటిని తీసుకుంటారు.
21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి
జనన, మరణ పత్రాలను 21 రోజుల్లోగా దరఖాస్తు చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఓ కాపీని ఉచితంగా ఇస్తారు. 21 రోజులు దాటితే 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఇప్పటి వరకు రోజుకు రూ.2 జరిమాన విధించే వారు. ఇప్పుడు రూ.20 చెల్లిస్తున్నారు. 30 రోజుల నుంచి ఏడాది లోపల అయితే రూ.5 జరిమానాను ఇంతకు ముందు చెల్లించేవారు. ఇప్పుడేమో రూ.50 చెల్లించక తప్పడం లేదు. ఈ విషయమై స్థానిక శేఖరయ్య మఠపతి మాట్లాడుతూ ఇంతకు ముందు ఓ ప్రతికి రూ.5 తీసుకొనే వారం, శుల్కాన్ని ఏకంగా 10 రెట్లు పెంచడం సాధారణ ప్రజలకు భారం అన్నారు. అందుకు గాను ఇంతకు ముందు ఉన్న శుల్కాన్నే కొనసాగించాలని కోరారు.
డిసెంబర్ 31న గెజిట్ నోటిఫికేషన్ విడుదల
కార్పొరేషన్ ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీధర్ దండెప్పనవర్ మాట్లాడుతూ 2024 డిసెంబర్ 31న గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. అప్పట్లో రూ.5 నుంచి రూ.10లకు జనన, మరణ పత్రాలు ఇచ్చేవారు. ప్రస్తుతం ధర పెంచి రూ.50 చేశారు. దీంతో పాలికె పరిధిలోని అన్ని జోన్లలో ప్రతి నెల సుమారు 450 నుంచి 500 వరకు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కోరుతూ దరఖాస్తులు వస్తాయి. వాటిని అదే స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. 2021–22లో జనన మరణ పత్రాలు ప్రతులను ప్రభుత్వమే పంపిణి చేసేది. ప్రస్తుతం సర్కారు ఏ పేపర్ వాడాలన్నది ఇచ్చిన ఆదేశం మేరకు నాణ్యత గల కాగితాన్ని ప్రింట్ చేసి పంపిణీ చేస్తున్నామన్నారు.
సాధారణ ప్రజలకు భారంగా
మారిన వైనం
పాత ఫీజునే కొనసాగించాలని అభ్యర్థన
Comments
Please login to add a commentAdd a comment