ఆరోగ్యదాయకం.. సూర్య నమస్కారం
చిక్కబళ్లాపురం: చిక్క సమీపంలోని ఆదియోగి పరమేశ్వరుని సన్నిధిలో పతంజలి యోగ సమితి సభ్యులు సూర్య నమస్కారాన్ని ఆచరించారు. నిత్యం 21 రోజులు సూర్య నమస్కారం, యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని యోగా గురు స్వామి లవణ తెలిపారు. యోగా శిక్షకులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సూర్య నమస్కారం నాడీమండలాన్ని చైతన్యం చేస్తుందని అన్నారు. ఒత్తిడిని, అనారోగ్యాన్ని దూరం చేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుందని తెలిపారు. 50 మందికి పైగా యోగాభ్యాసులు సూర్య నమస్కారం నిర్వహించారు.
మందు పార్టీ వికటించి.. ఇద్దరు మృత్యువాత
దొడ్డబళ్లాపురం: మద్యం, డ్రగ్స్ పార్టీ చేసుకున్న అసోం వలస కార్మికులు అది వికటించి మృత్యువాత పడ్డారు. బెంగళూరు సూర్యనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటనన జరిగింది. అసోంకు చెందిన దివాన్ అఫ్రీద్ అలీ (27), అష్రఫ్ అలీ (34) చనిపోయినవారు. యారండనహళ్లిలో నివసిస్తున్న ఓ అసోంవాసి ఇంట్లో సోమవారం రాత్రి మద్యం విందు చేసుకున్నారు. కొంతసేపటికి ముగ్గురూ అస్వస్థులై పడిపోయారు. తెలిసిన వ్యక్తి ఇంట్లోకి వచ్చి చూడగా ఒకరు మృతిచెంది, మరో ఇద్దరు అపస్మారకంలో పడిఉన్నారు. ఆస్పత్రికి తరలించగా మరో వ్యక్తి మరనించాడు. అతిగా మద్యం తాగి ఏదైనా డ్రగ్స్‌ను తీసుకోవడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో నిజం తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. బాధితులు బెంగళూరుకు వలస వచ్చి స్థానిక ఫ్యాక్టరీలో పనిచేసేవారు. సూర్యనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
లా ప్రశ్నాపత్రాల లీకేజీలో ముగ్గురు అరెస్టు
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని లా యూనివర్సిటీలో పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన కేసులో సైబర్ క్రైం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. కోలారులోని బసవశ్రీ లా కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ నాగరాజు, ఈయన కారు డ్రైవర్ కమ్ కాలేజీ విద్యార్థి అయిన జగదీష్, బంగారుపేట లా కాలేజీ విద్యార్థి వరుణ్ కుమార్ పట్టుబడ్డారు. రాష్ట్ర లా యూనివర్సిటీ ద్వారా జనవరి 23న జగరాల్సిన పరీక్షల కాంట్రాక్ట్ లా–1 ప్రశ్నాపత్రం టెలిగ్రాం, వాట్సాప్ గ్రూపుల్లో ముందే వచ్చేశాయి. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.
మత్తులో కారు డ్రైవింగ్
● ఇద్దరు దుర్మరణం
దొడ్డబళ్లాపురం: విద్యార్థులు మద్యం తాగిన మత్తులో కారు నడిపి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెంది మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన బెంగళూరు బన్నేరుఘట్ట సమీపంలోని రాగిహళ్లి వద్ద చోటుచేసుకుంది. గొట్టగెరె సమీపంలోని ప్రైవేటు కాలేజీలో చదువుతున్న కేరళకు చెందిన సహా హక్ (25), అర్షు (23) మృతులు. దేవనారాయణ, సాహిల్ అనేవారు తీవ్రంగా గాయపడగా, స్థానిక ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి బాగా మద్యం తాగిన విద్యార్థులు కారులో అతివేగంగా వస్తూ రాగిహళ్లి వద్ద చెట్టును ఢీకొన్నారు. బన్నేరుఘట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
లాకర్‌లో
రూ.8 లక్షలకు చెదలు
దొడ్డబళ్లాపురం: ఇంట్లో కంటే బ్యాంకు లాకర్‌లో భద్రంగా ఉంటాయి కదా అని నగదు దాచుకుంటే, చెదలు పట్టిపోయాయి. రూ.8 లక్షలు పనికి రాకుండా అయ్యాయి. ఈ సంఘటన మంగళూరులో చోటుచేసుకుంది. సఫల్ అనే ఖాతాదారు మంగళూరు కోటెకార్‌లో ఉన్న ఓ ప్రముఖ బ్యాంకులో 6 నెలల క్రితం రూ.8 లక్షల నగదు దాచాడు. డబ్బులు అవసరమై తీసుకోవాలని బ్యాంకుకి వచ్చాడు. బ్యాంకు సిబ్బందితో కలిసి లాకర్ తెరిచి చూస్తే.. నగదు మొత్తం తడిచి, రంగుమారి చెదలు పట్టి పొడి పొడిగా కనిపించింది. అది చూసి సఫల్ లబోదిబోమన్నాడు. లాకర్‌లలో నగదు దాచరాదని తాము ముందే చెప్పామని సిబ్బంది జారుకున్నారు. దీంతో బాధితుడు బెంగళూరు వచ్చి బ్యాంకు మెయిన్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశాడు.
ఆరోగ్యదాయకం.. సూర్య నమస్కారం
Comments
Please login to add a commentAdd a comment