పార్శ్వగూనికి చికిత్స పొందాలి
హొసపేటె: వెన్నెముక వంకరపోయి స్కోలియోసిస్ లక్షణాలను గుర్తిస్తే, వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందాలని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ శంకర్‌నాయక్ తెలిపారు. నగరంలోని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన వెన్నుపాము గాయాలపై అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరి వెన్నెముక సాధారణంగా వక్రతను కలిగి ఉంటుంది. వెనుక నుంచి చూసినప్పుడు వెన్నెముక నిటారుగా కనిపిస్తుంది. అయితే పార్శ్వగూని ఉన్న పిల్లలు, కౌమార దశలో ఉన్నవారు వెన్నెముక అసాధారణ ఎస్, సీ ఆకారపు వక్రతను కలిగి ఉంటారు. వెన్నెముక వ్యాధుల లక్షణాలు, వారికి అవసరమైన సంరక్షణ, వైద్య సలహాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ శిబిరం లక్ష్యం అన్నారు. బెంగళూరులోని భగవాన్ మహావీర్ జైన్ ఆస్పత్రి సహకారంతో, విజయనగర జిల్లాలో వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఉచిత చికిత్స పొంది మంచి భవిష్యత్తును పొందాలన్నారు. చికిత్సను ఎటువంటి సమస్యలు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తారన్నారు. చాలా మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున ఈ సంస్థ సామాజిక సేవల ద్వారా ఉచిత చికిత్స పొందవచ్చన్నారు. జిల్లా ఆర్‌సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య మాట్లాడుతూ జాతీయ బాలల ఆరోగ్య కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 450 మంది పిల్లలకు ఉచిత శస్త్రచికిత్సను విజయవంతంగా అందించామన్నారు. మహావీర్ జైన్ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment