
పీవీఆర్–ఐనాక్స్‌పై యువకుని కేసు
65 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశం
బెంగళూరు: పీవీఆర్ ఐనాక్స్, బుక్‌మై షోలపై ఓ యువకుడు కోర్టుకెక్కాడు. సుదీర్ఘమైన వాణి జ్య ప్రకటనలతో తన సమయాన్ని వృథా చేశారని, మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపిస్తూ కేసు వేశాడు. అతనికి రూ.65 వేల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది! ఈ ఆసక్తికరమైన ఘటన బెంగళూరులో జరిగింది. నగరానికి చెందిన అభిషేక్ ‘సామ్ బహదూర్’సినిమా కోసం బుక్‌మై షోలో మూడు టికెట్లు కొన్నాడు. సాయంత్రం 4.05కు మొదలవాల్సిన సినిమా కాస్తా ఏకంగా 30 నిమిషాలు సినిమా ప్రకటనలు, ట్రైలర్ల ప్రసారంతో 4.30కు మొదలైంది. దాంతో సకాలంలో ఆఫీసుకు వెళ్లలేకపోయానని అభిషేక్ ఆరోపించాడు.
‘‘నా విలువైన సమయం వృథా అయింది. ప్రకటనలు ద్వారా ప్రయోజనం పొందడానికి థియేటర్ వారు షో టైమింగ్స్‌ను తప్పుగా పేర్కొన్నారు. ఇది అన్యాయం’’అంటూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. సమయాన్ని డబ్బుగా పరిగణిస్తామని వినియోగదారుల కోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదుదారుకు జరిగిన నష్టాన్ని పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ పూడ్చాలని పేర్కొంది. అనైతిక వ్యాపార చర్యలకు పాల్పడ్డందుకు, సమయాన్ని వృథా చేసినందుకు రూ.50 వేలు, మానసిక వేదనకు రూ.5 వేలు, ఫిర్యాదు, ఇతర ఉపశమనాలకు రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది. పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సంస్థలకు రూ.లక్ష జరిమానా కూడా విధించింది. బుక్‌మైషో కేవలం టికెట్ బుకింగ్ వేదిక కాబట్టి ఎలాంటి పరిహారమూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రకటనల స్ట్రీమింగ్ సమయంపై నియంత్రణ లేకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.