ఎంతసేపు సినిమా చూస్తే అంతే ధర చెల్లించేలా.. | PVR Inox FLEXI Show initiative designed to offer moviegoers more flexibility and value | Sakshi
Sakshi News home page

ఎంతసేపు సినిమా చూస్తే అంతే ధర చెల్లించేలా..

Published Sat, Dec 21 2024 9:39 AM | Last Updated on Sat, Dec 21 2024 10:48 AM

PVR Inox FLEXI Show initiative designed to offer moviegoers more flexibility and value

ఎంతో ఆసక్తిగా సినిమా చూసేందుకు వెళ్తారు. తీరా అరగంట చూశాక సినిమా నచ్చకో లేదా ఏదైనా అత్యవసర పనిమీదో బయటకు వెళ్లాల్సి రావొచ్చు. అలాంటి సందర్భంలో టికెట్‌ డబ్బులు వృథా అయినట్టే కదా. ఇలాంటి ప్రత్యేక సమయాల్లో టికెట్‌ డబ్బు నష్టపోకుండా మీరు ఎంతసేపు సినిమా చూస్తారో అంతే మొత్తం చెల్లించేలా పీవీఆర్‌ ఐనాక్స్‌ ప్రత్యేక  సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపింది. అందులో భాగంగా ‘ఫ్లెక్సీ షో’ అనే కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.

ఈ ఫ్లెక్సీ షో ద్వారా సినిమా చూసే సమయానికి మాత్రమే డబ్బు చెల్లించవచ్చు. ఈ వినూత్న టికెటింగ్ మోడల్‌లో సీటు ఆక్యుపెన్సీని పర్యవేక్షించడానికి, మూవీ మిగిలి ఉన్న సమయం ఆధారంగా రీఫండ్‌లను లెక్కించడానికి ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఎలా పని చేస్తుందంటే..

టికెట్‌ స్కానింగ్‌: మీరు సినిమా థియేటర్‌లోకి వెళ్లేప్పుడు టికెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. మీ ఎంట్రీ, ఎక్జిట్‌ సమయాలను ఏఐ ట్రాక్‌ చేస్తుంది. దానిపరంగా మీకు డబ్బు రీఫండ్‌ అవుతుంది.

రీఫండ్ సిస్టమ్: సినిమా 75% కంటే ఎక్కువ మిగిలి ఉంటే, టికెట్ ధరలో 60% తిరిగి పొందవచ్చు. సినిమా వ్యవధి 50-75%కు మధ్య ఉంటే 50% రీఫండ్ అవుతుంది. ఇంకా 25-50% సినిమా మిగిలి ఉన్నప్పుడు మీరు థియేటర్‌ నుంచి బయటకు వెళితే 30% రీఫండ్ ఇస్తామని పీవీఆర్‌ ఐనాక్స్‌ పేర్కొంది.

అదనపు ఛార్జీలు

ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునేవారు టికెట్‌ బుకింగ్‌ సమయంలోనే ‘ఫ్లెక్సీ షో’ ఆప్షన్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకు సాధారణ ధర కంటే టికెట్‌ ఫేర్‌లో 10 శాతం అధికంగా చెల్లించాలి.

ఎక్కడ అమలు చేస్తున్నారు..

ఈ సదుపాయాన్ని ప్రస్తుతం న్యూఢిల్లీ, గుర్గావ్‌ల్లో అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదికూడా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రేక్షకుల స్పందన ఆధారంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో జాబ్స్‌ పెరుగుతాయా? తగ్గుతాయా?

కంపెనీపై ప్రభావం

ప్రేక్షకుల సంతృప్తి: సినిమా చూసే సమయానికి మాత్రమే ధర నిర్ధారించడం వల్ల పీవీఆర్‌ ఐనాక్స్‌పై ప్రేక్షకులకు విశ్వసనీయత పెరుగుతుందని కంపెనీ అధికారులు తెలిపారు. ప్రేక్షకుల సంతృప్తికి సంస్థ పెద్దపీట వేస్తుందని చెప్పారు.

ఆదాయ వృద్ధి: ఫ్లెక్సీ షో టికెట్ల ధర 10% ఎక్కువగా ఉన్నప్పటికీ, సినిమా వీక్షించిన సమయం ఆధారంగా రీఫండ్లను అందిస్తుండడంతో కంపెనీ ఆదాయం పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీ అందించే సౌలభ్యాన్ని వినియోగించుకునేందుకు అదనపు ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని కంపెనీ భావిస్తుంది.

పోటీని తట్టుకునేలా..: ఈ వినూత్న టికెటింగ్ మోడల్ పీవీఆర్‌ ఐనాక్స్‌ ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోని సంస్థలతో పోటీ పడేందుకు ఉపయోగపడుతుంది.

డేటా సేకరణ: సీట్ల ఆక్యుపెన్సీని పర్యవేక్షించడానికి, రీఫండ్లను లెక్కించడానికి ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలు ఉపయోగించనున్నారు. దాంతో ప్రేక్షకుల ప్రవర్తన, వారి ప్రాధాన్యతలకు సంబంధించిన డేటాను సేకరించే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో ప్రేక్షకులకు మరింత మెరుగైన సినిమా అనుభవాన్ని అందించేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement