ఫోర్జరీ సంతకాలు, నకిలీ ఉద్యోగాలు
మండ్య: సులభంగా సర్కారీ ఉద్యోగం వస్తుందనుకుంటే ఎంత డబ్బయినా చెల్లించడానికి కొందరు సరే అంటారు. దానినే కొందరు పెట్టుబడిగా మార్చుకుంటారు. సీఎం సిద్ధరామయ్యతో పాటు ప్రభుత్వ అధికారులు సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఉద్యోగ ఉత్తర్వులు ఇస్తున్న వంచకునిపై మండ్య తూర్పు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. మండ్య తావరకెరె నివాసి హెచ్‌సీ వెంకటేశ్ ఘరానా మోసగాడు, బెంగళూరు విధానసౌధలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పలువురు వద్ద నుంచి సుమారు రూ. 31 లక్షలను దోచుకున్నాడు. విద్యా శాఖ సబ్‌డైరెక్టర్‌గా పని ఇప్పిస్తానని ఒకరి వద్ద నుంచి రూ. 12.24 లక్షలను, వాణిజ్య శాఖలో ఉద్యోగమని రూ. 19 లక్షలను స్వాహా చేశాడు.
ఇట్టే మోసాలు
నేత్రావతికి అనే మహిళ కుమారునికి విద్యా శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. ఆమె రూ. 9,24,000 ను ఖాతాకు బదిలీ చేసింది. మరో రూ. 3 లక్షలను ఇప్పించుకున్నాడు. ఆ తర్వాత విద్యా శాఖ సబ్ డైరెక్టర్ ఉద్యోగమని సీఎంతో సహా ఉన్నతాధికారుల ఫోర్జరీ సంతకాలు చేసి ఉత్తుత్తి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశాడు. ఇలా మల్లేశ్ అనే వ్యక్తి నుంచి వాణిజ్య శాఖలో అకౌంటెంట్ ఉద్యోగమని దశల వారీగా రూ. 19 లక్షలను వసూలు చేశాడు. నియామక ఉత్తర్వులు తీసుకుని ఆశగా వెళ్లిన బాధితులను అధికారులు మందలించి పంపారు. దీంతో మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లక్షలాది రూపాయల వసూళ్లు
మండ్యలో ఘరానా మోసగాడు
Comments
Please login to add a commentAdd a comment