
కెంకెర గ్రామోత్సవం
తుమకూరు: జిల్లాలోని హులియూరు సమీపంలోఉన్న కెంకెరెలో గ్రామ దేవత కాళమ్మ దేవి కలశ ఉత్సవం గురువారం రమణీయంగా జరిగింది. కాళికాంభ దేవి, గొల్ళరహట్టి కరియమ్మ, గౌడగెరె దుర్గమ్మ, ఈరబొమ్మక్క దేవి, అంబికా దేవి తదితర దేవతల విగ్రహాలను భక్తులు సుందరంగా అలంకరించి ఊరేగించారు. 111 మంది మహిళలు కలశాలను ఎత్తుకొని ఊరేగించారు.
డ్రగ్స్ కేసులో ఇద్దరికి
15 ఏళ్ల జైలుశిక్ష
బనశంకరి: సిలికాన్ సిటీలో డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులకు నగర ఎన్‌డీపీఎస్ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. నైజీరియా పౌరుడు ఒకోరో క్రిస్టియాన్ ఇపియాని, బెంగళూరు టీసీ పాళ్య నివాసి రోహిత్ క్రిస్టొఫర్ శిక్షపడినవారు. 2021 ఫిబ్రవరిలో కబ్బన్‌రోడ్డులో డ్రగ్స్‌ను విక్రయిస్తుండగా ఇద్దరిని కమర్షియల్‌స్ట్రీట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 350 గ్రాములు బరువుగల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. క్రిస్టియాన్ 2018లో 3 నెలలు వీసా తీసుకుని భారత్‌కు వచ్చాడు, వీసా అవధి ముగిసినా తిరిగి వెళ్లలేదు. టీసీ.పాళ్య ఫుట్‌బాల్ అకాడమీలో పరిచయమైన రోహిత్‌తో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేపట్టారు. నేరం రుజువు కావడంతో క్రిస్టియాన్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష, రూ.1.75 లక్షల జరిమానా, రోహిత్ క్రిస్టొఫర్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
మెడికో బలవన్మరణం
చిక్కబళ్లాపురం: తాలూకా పరిధిలోని పట్రేనహళ్లి గ్రామంలో ఉన్న హేమంత్ (18) అనే మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ముద్దేనహళ్లిలోని సత్యసాయి వైద్య కాలేజీ ప్రథమ ఎంబీబీఎస్ చదువుతున్నాడు, ఇతని తల్లి వైద్యురాలు. ఇటీవల ఇద్దరు వియత్నాం దేశంలో పర్యటించి బుధవారం ఉదయం వచ్చారు. ఏమైందో కానీ హేమంత్ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తమ తోటలోని ఇంటిలో ఉరి వేసుకొని బలవన్మరణం చెందాడు. మాజీ ఎమ్మెల్యే కెపి బచ్చేగౌడకు బంధువులు అని తెలిసింది. చదువులో టాపర్‌గా పేరుపొందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిక్క రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కుమారుని మరణంతో తల్లి, బంధువుల రోదనలు మిన్నంటాయి.
నకిలీ పత్రాలతో ఇల్లు కబ్జా
● ముడాలో మరో బాగోతం
● అధికారి సస్పెండ్
మైసూరు: మైసూరు ముడాలో తరచూ ఏదో ఒక కుంభకోణం బయటపడుతూ ఉంటుంది. మరణించిన వ్యక్తి పేరిట ఉన్న ఇంటిని కబ్జా చేసుకునేందుకు నకిలీ దాఖలాలను సృష్టించేందుకు వంచకునితో ముడా మేనేజర్ సోమసుందర్ చేతులు కలిపాడు. దీంతో అతనిని ముడా కమిషనర్ ఏఎన్ రఘునందన్ సస్పెండ్ చేశారు. ఆర్‌టీ కార్యకర్త బీఎన్ నాగేంద్ర దాఖలాలతో సహా ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి ఈ చర్యలు చేపట్టారు. గోకులం 3వ స్టేజీ బడావణెలో మోడల్ హౌన్ నంబర్–867లోని భవనం యజమాని లిలియన్ శారద జోసెఫ్‌ది. ఆమె 1983 సెప్టెంబర్‌లో మరణించారు. ఆమె బంధువైన నెవిల్ మార్కస్ జోసెఫ్ గతేడాది నకిలీ ఫౌతి ఖాతా చేసిచ్చి, బిట్ ఆఫ్ ల్యాండ్‌ను కూడా మంజూరు చేసుకుని హక్కుపత్రాలు పొందాడు. అతనికి మేనేజర్ సోమసుందర్ అన్ని విధాలా సహకరించాడు. ఆ ఇంటిని మమత, శ్యాం దంపతులకు కోట్లాది రూపాయలకు విక్రయించాడు. ఈ స్కాంలో భాగస్తుడైన ప్రత్యేక తహసీల్దార్ రాజశేఖర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ముడా కమిషనర్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.

కెంకెర గ్రామోత్సవం

కెంకెర గ్రామోత్సవం

కెంకెర గ్రామోత్సవం