
రన్య రావుచే 100 కేజీల పసిడి స్మగ్లింగ్
బనశంకరి: మార్చి 3వ తేదీన రాత్రి దుబాయ్ నుంచి రూ.17 కోట్ల విలువచేసే 14 కిలోల బంగారం స్మగ్లింగ్ చేసిన కేసులో నటీనటులు రన్యరావ్, కొండూరు తరుణ్ రాజు కు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. రన్యరావ్, ఆమె స్నేహితుడు బెయిల్ పిటిషన్‌పై శనివారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి ఎస్.విశ్వజిత్‌శెట్టి ధర్మాసనం బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించారు. ఆమెను డీఆర్‌ఐ అరెస్టు చేసి విచారించి, తరువాత తరుణ్‌రాజును నిర్బంధించడం తెలిసిందే. ప్రస్తుతం వారు పరప్పన జైలులో రిమాండులో ఉన్నారు. కేసు వాదనల్లో డీఆర్‌ఐ పలు కొత్త అంశాలను బయటపెట్టింది. రన్య సుమారు 100 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు గుర్తించామని తెలిపింది.
సాక్ష్యాలు లభించాయి
రన్య అరెస్ట్ అక్రమమని, బెయిల్ మంజూరు చేయాలని, అధికారులు కస్టమ్స్ నిబంధనలను పూర్తిగా అతిక్రమించారని ఆమె న్యాయవాది వాదించారు. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన డీఆర్‌ఐ తరఫు న్యాయవాదులు రన్యరావు దుబాయ్ నుంచి బంగారం తీసుకొచ్చి తరుణ్‌రాజుకు ఇవ్వగా, అతడు సాహిల్ జైన్ అనే వ్యాపారికి అప్పగించాడని తెలిపారు. రన్య 100 కిలోల బంగారం అక్రమ రవాణా చేసినట్లు సాక్ష్యాలు లభించాయని, కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉందని, రన్యరావు, తరుణ్‌రాజును మరింతగా విచారించాలని కింది కోర్టుకు మనవి చేశామని తెలిపారు. ఇద్దరు కలిసి 31 సార్లు దుబాయికి వెళ్లారని, 25వ సారి ఒకేరోజు దుబాయ్‌కి కి వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. రన్యరావుకు పోలీసు భద్రతను ఎందుకు ఇచ్చారు అనేది విచారిస్తున్నామని, ఈ దశలో బెయిల్ ఇవ్వరాదని విన్నవించారు. ఇరువర్గాల వాదనలను ఆలకించి జడ్జి, బెయిలును నిరాకరించారు.
హైకోర్టులో డీఆర్‌ఐ వాదనలు
రన్య, తరుణ్‌రాజుకు బెయిలు తిరస్కృతి

రన్య రావుచే 100 కేజీల పసిడి స్మగ్లింగ్