అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నాయకుల రహస్య, బహిరంగ భేటీలో తాజాగా రాజకీయాల్లో కుతూహలానికి కారణమయ్యాయి. దావణగెరె కాంగ్రెస్ వృద్ధ నేత శామనూరు శివశంకరప్పని బీజేపీ నాయకుడు బసవరాజ బొమ్మై కలవడంపై అనేక ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. అదేరీతిలో డీసీఎం శివకుమార్‌తో బీజేపీ నేత రేణుకాచార్య భేటీ అయ్యారు. మరోవైపు కొందరు బీజేపీ నాయకులు కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉంటూ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని కాషాయనేతలు సీటీ రవి, ప్రతాపసింహా మండిపడడం రెండు పారీ్టల్లో కలకలం రేపింది.
కర్ణాటక: మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు రేణుకాచార్య బుధవారం బెంగళూరులో ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ను భేటీ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రేణుకాచార్య ఓడిపోయాక మౌనంగా ఉంటున్నారు. ఈ తరుణంలో డీకేని కలవడం రాజకీయ రంగంలో చర్చకు కారణమైంది. భేటీ తరువాత రేణుకాచార్య మీడియాతో మాట్లాడుతూ డీకే తనకు మంచి స్నేహితుడని, అందుకే కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని అన్నారు. హొన్నళ్లిలో జరిగే వ్యవసాయ మేళాకు ఆహా్వనించానన్నారు.
కుమ్మక్కుపై వారినే అడగండి
కొంతమంది బీజేపీ నాయకులు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ, బీజేపీ సీనియర్‌నేత సీటీ రవి ఆరోపణలు చేసిన సమయంలో ఈ భేటీ జరగడం విశేషం. ఈ ఆరోపణలపై రేణుకాచార్య స్పందిస్తూ కుమ్మక్కుపై సీటీ రవి, ప్రతాపసింహనే అడగాలని, తనకు సమాచారం లేదని, ఏ అర్థంలో చెప్పారనేది తెలియదని అన్నారు.
ప్రతాపసింహ, సీటీ రవి ఏమన్నారు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ సీనియర్ నాయకులు మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించటం గాని, ఆరోపణలు చేయటం గాని చేయటం లేదు. అనేక మంది సీనియర్ నాయకులు సీఎం సిద్దరామయ్యతో కుమ్మక్కయ్యారని ఎంపీ ప్రతాప్ సింహ, సీటీ రవి ఆరోపణలు చేశారు. రెండు పారీ్టల నాయకులు కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక బీజేపీ నాయకులను బెదిరింపులకు గురిచేశారని వారు ఆరోపించారు.
అది మామూలు భేటీనే: బొమ్మై
బీజేపీ మాజీ సీఎం బసవరాజ బొమ్మై మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే శామనూరు శివశంకప్పను రహస్యంగా భేటీ కావటంపై రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. దీనిపై బుధవారం బొమ్మై స్పందిస్తూ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. నా రాజకీయ వైఖరిలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన ట్విట్టర్లో అన్నారు. ఆయన తనకు బంధువు అని, తరచూ ఇళ్లకు వెళ్లి వస్తుంటామని, దీనికి రాజకీయాలు పూయడం సరికాదన్నారు. వారి మనమళ్లకు పెళ్లి సంబంధాల గురించి చర్చ జరిగింది, ఇందులో రాజకీయాల ప్రస్తావన లేదన్నారు. మరోవైపు శివశంకరప్ప స్పందిస్తూ ఎన్నికలు జరిగిననాటి నుంచి తాము కలవలేదు. అందుకే కలిశామన్నారు. మాకు బంధుత్వం ఉంది, కొన్ని విషయాలు చెప్పేందుకు సాధ్యపడదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment