సాక్షి, బెంగళూరు : ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి శివమొగ్గలోని మైసూర్ పేపర్ మిల్లు పరిధిలోని చెట్లను అమ్మేయాలా అని అటవీ శాఖ అధికారులను సీఎం బి.ఎస్.యడియూరప్ప ప్రశ్నించారు. మిల్లు పరిస్థితిపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సీఎం శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ.. 1960లో శరావతి విద్యుత్ కేంద్రాన్ని నిర్మించే సమయంలో శివమొగ్గలోని 3,500 కుటుంబాలు తమ భూములను కోల్పోయాయన్నారు. వారందరికీ పునరాసంతో పాటు 9,800 ఎకరాల భూమిని ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని కానీ వారికి సరైన సాయం అందలేదని తెలిపారు.
ఆ కుటుంబాలకు సహాయం చేయడానికి వెంటనే టైటిల్ డీడ్స్ సిద్ధం చేయాలని శివమిగ్గ జిల్లా పాలన యంత్రాంగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు.అదే విధంగా ఈ భూమలుపై సమగ్ర సర్వే చేపట్టాలని తెలిపారు. దీంతో పాటు భూములకు సంబంధించిన పహానీలను పొందేందుకు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని అధికారులకు తెలిపారు. రోడ్లను వేయడానికి సంబంధిత శాఖ వద్ద ఎన్‌వోసీ పొందే విధంగా చర్యలు చేపట్టాలని టూరిజం శాఖకు వెల్లడించారు.
తిర్థల్లి ఎమ్మెల్యే అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ.... మిల్లు ఉద్యోగులకు మూడు, నాలుగేళ్లుగా జీతాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో వారికి జీతాలు ఇవ్వడానికి కనిపిస్తున్న ఏకైక మార్గం పేపర్ మిల్లు పరిశ్రమలోని చెట్లను అమ్మడమేనని ఆయన అన్నారు.
కాగా పేపర్ తయారీ కోసం 1936లో అప్పటి మైసూర్ రాజు కృష్ణరాజ వడయార్ బహదూర్ భద్రావతి నది ఒడ్డున శివమొగ్గలో దీన్ని స్థాపించారు. అది 1977లో ప్రభుత్వ సంస్థగా మారింది. ఈ మిల్లులో కర్ణాటక ప్రభుత్వానికి 64.7 శాతం వాటా ఉంది. ప్రభుత్వంతోపాటు ఆ ప్రాంత ప్రజలు, ఐడీబీఐ బ్యాంకు, ఎల్‌ఐసీ కూడా మిల్లులో వాటా దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment