బెంగళూరు: వాలంటైన్స్ డే అని ప్రేమికుల రోజు అని ఫిబ్రవరి 14వ తేదీన యువత ఒక ఉత్సవం మాదిరి చేసుకుంటుంది. ఏడాది పొడవునా యువతీయువకులకు అనడం బదులు ప్రేమికులకు ఉండే ఒకే ఒకరోజు. ఈరోజు జీవితంలో మరచిపోని విధంగా చేసుకోవాలని భావిస్తుంటారు. అలాంటి వారికి హిందూ సంఘాలు అడ్డంకిగా మారడం సహజం. సహజంగానే ఈసారి కూడా హిందూత్వ సంఘాలు ప్రేమికులకు హెచ్చరిక జారీ చేశాయి.
లవర్స్ డే పాశ్చాత్య సంస్కృతి అని శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ తెలిపారు. ఫిబ్రవరి 14వ తేదీ వాలంటైన్స్ డేని ‘మాతా పిత పూజా దినోత్సవం’గా తాము పాటిస్తామని ప్రకటించారు. వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ పేరిట కర్ణాటకలో వివిధ చోట్ల జరిగే అసభ్య కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనికోసం తమ వలంటీర్లను నియమిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది తాము రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజును మాతా పిత దినోత్సవంగా నిర్వహిస్తాం.. తల్లిదండ్రులను గౌరవించే రోజుగా పరిగణిస్తామని వివరించారు. కర్ణాటకలో 60 నుంచి 70 చోట్ల ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతాయని ప్రమోద్ వెల్లడించారు.
ఫిబ్రవరి 14వ తేదీ రోజు పబ్‌లు, బార్లు , ఐస్‌క్రీమ్ పార్లర్లు, పార్కులు వంటివాటిపై తమ సభ్యుల నిఘా ఉంటుందని ప్రమోద్ ముతాలిక్ స్పష్టం చేశారు. అయితే అసభ్యకర కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము పోలీసులకు సహకరిస్తారని తెలిపారు. 2009లో బెంగళూరులో శ్రీరామ్ సేన ప్రతినిధుల వైఖరి తీవ్ర వివాదం రేపిన విషయం తెలిసిందే. ప్రేమికుల రోజు మంగుళూరులోని ఓ పబ్ లోడ్యాన్స్‌లు చేస్తున్న యువతీయువకులపై దాడికి పాల్పడ్డారు. 2018లో కూడా ఈ విధమైన ఘటన చోటుచేసుకోగా దానికి కారకుడిగా పేర్కొంటూ ప్రమోద్ ముతాలిక్‌ను అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా పోలీసులకు తాము సహకరిస్తామని శ్రీరామ్ సేన ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment