Hindu organisations
-
ఫిబ్రవరి 14: లవర్స్‌కు శ్రీరామ్ సేన హెచ్చరిక
బెంగళూరు: వాలంటైన్స్ డే అని ప్రేమికుల రోజు అని ఫిబ్రవరి 14వ తేదీన యువత ఒక ఉత్సవం మాదిరి చేసుకుంటుంది. ఏడాది పొడవునా యువతీయువకులకు అనడం బదులు ప్రేమికులకు ఉండే ఒకే ఒకరోజు. ఈరోజు జీవితంలో మరచిపోని విధంగా చేసుకోవాలని భావిస్తుంటారు. అలాంటి వారికి హిందూ సంఘాలు అడ్డంకిగా మారడం సహజం. సహజంగానే ఈసారి కూడా హిందూత్వ సంఘాలు ప్రేమికులకు హెచ్చరిక జారీ చేశాయి. లవర్స్ డే పాశ్చాత్య సంస్కృతి అని శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ తెలిపారు. ఫిబ్రవరి 14వ తేదీ వాలంటైన్స్ డేని ‘మాతా పిత పూజా దినోత్సవం’గా తాము పాటిస్తామని ప్రకటించారు. వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ పేరిట కర్ణాటకలో వివిధ చోట్ల జరిగే అసభ్య కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనికోసం తమ వలంటీర్లను నియమిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది తాము రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజును మాతా పిత దినోత్సవంగా నిర్వహిస్తాం.. తల్లిదండ్రులను గౌరవించే రోజుగా పరిగణిస్తామని వివరించారు. కర్ణాటకలో 60 నుంచి 70 చోట్ల ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతాయని ప్రమోద్ వెల్లడించారు. ఫిబ్రవరి 14వ తేదీ రోజు పబ్‌లు, బార్లు , ఐస్‌క్రీమ్ పార్లర్లు, పార్కులు వంటివాటిపై తమ సభ్యుల నిఘా ఉంటుందని ప్రమోద్ ముతాలిక్ స్పష్టం చేశారు. అయితే అసభ్యకర కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము పోలీసులకు సహకరిస్తారని తెలిపారు. 2009లో బెంగళూరులో శ్రీరామ్ సేన ప్రతినిధుల వైఖరి తీవ్ర వివాదం రేపిన విషయం తెలిసిందే. ప్రేమికుల రోజు మంగుళూరులోని ఓ పబ్ లోడ్యాన్స్లు చేస్తున్న యువతీయువకులపై దాడికి పాల్పడ్డారు. 2018లో కూడా ఈ విధమైన ఘటన చోటుచేసుకోగా దానికి కారకుడిగా పేర్కొంటూ ప్రమోద్ ముతాలిక్ను అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా పోలీసులకు తాము సహకరిస్తామని శ్రీరామ్ సేన ప్రకటించింది. -
హిందూ సంస్థలు పెట్టే భోజనం మాకొద్దు..!
ఉజ్జయినిః మదర్సాల్లో హిందూ సంస్థలనుంచీ వచ్చే మధ్యాహ్న భోజనాన్ని తిరస్కరిస్తున్నారన్న వార్త.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉజ్జయిని లోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న స్థానిక హిందూ సంస్థలు మదర్సాలకు కూడా అందిస్తుండగా... సుమారు 30 మదర్సాలల్లో ఇటీవల ఆ భోజనాన్ని తిప్పి కొడుతున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని మదర్సాల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని నిర్వాహకులు తిరస్కరిస్తున్నారు. 2010 సంవత్సరం నుంచీ ఇస్కాన్ సంస్థ స్థానికంగా ఉన్న మొత్తం 315 స్కూళ్ళకు మధ్యాహ్న భోజనం అందిస్తోంది. అయితే ఇటీవల హిందూ సంస్థలనుంచీ వచ్చే భోజనాన్ని స్వీకరించవద్దని, వారు తమ నమ్మకాలను వమ్ము చేస్తున్నారని మదర్సా నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇస్కాన్ నుంచి పిల్లలకు అందుతున్న మిడ్ డే మీల్ ను తిప్పికొట్టారు. ఇస్కాన్ నుంచి భోజనం స్కూళ్ళకు పంపే ముందు.. దేవుడికి నైవేద్యం పెడతారన్న అనుమానంతో ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు ఈ తాజా నిర్ణయం తీసుకున్నారు. జూలై 2016 లో ఇస్కాన్ టెండర్ ను సొంతం చేసుకున్న బీఆర్కే ఫుడ్స్, మా పార్వతి ఫుడ్స్ స్థానికంగా ఉన్న సుమారు 315 స్కూళ్ళకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుండగా.. తాజాగా 56 మదర్సాలు ఆ భోజనాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సప్లయర్స్ అందిస్తున్న భోజనాన్ని స్వీకరిస్తే.. మదర్సాలనుంచీ తమ పిల్లలను మానిపించేందుకు సైతం కొందరు తల్లిదండ్రులు సిద్ధమౌతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు మదర్సాల్లోని పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనాన్ని వారికి అక్కడే వండి పెట్టాలని, ఇతర సంస్థలనుంచీ స్వీకరించవద్దని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మిడ్ డే మీల్ నిరాకరణపై ప్రశ్నించగా.. మదర్సాల్లోని పిల్లలు ప్రత్యేక ఆహారాన్ని కోరుకుంటున్నారని, అందుకే ప్రస్తుతం అందుతున్న భోజనాన్ని నిరాకరిస్తున్నారని మదర్సా నిర్వాహకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మిడ్ డే మీల్ వివాదంపై పూర్తి విచారణ జరగాల్సి ఉంది.