కులగణన శాసీ్త్రయంగా చేపట్టాలి..
● జనాభా పెరుగుతుంటే.. బీసీలు ఎలా తగ్గుతారు? ● 317 జీఓ విషయంలో కేసీఆర్ బాటలోనే రేవంత్‌రెడ్డి ● బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే కమిషన్ వేసి కులగణన శాసీ్త్రయంగా చేయాలని మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. తమిళనాడు, బిహార్ రాష్ట్రాల్లో చట్టబద్ధమైన కమిటీ వేసి కులగణన చేపట్టారని తెలిపారు. ఖమ్మం – నల్లగొండ – వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పులి సరోత్తంరెడ్డి తరఫున మంగళవారం ఆయన ఖమ్మంలో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులి సరోత్తమ్‌రెడ్డి తమ అభ్యర్థి అని, ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం ఈటల విలేకరులతో మాట్లాడుతూ.. 2011లో 3.61 కోట్లుగా ఉన్న రాష్ట్ర జనాభా.. ఇప్పుడు 4కోట్లు దాటి ఉంటుందన్నారు. ఓ పక్క జనాభా పెరుగుతుంటే బీసీల జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నిజాయితీ లేకపోవడంతోనే ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.
317 జీఓకు వ్యతిరేకంగా పోరాడాం..
గతంలో కేసీఆర్ తీసుకొచ్చిన 317 జీఓతో టీచర్లు మనోవేదనకు గురయ్యారని, ఈ జీఓ తొలగిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా మోసం చేశారని ఈటల విమర్శించారు. కానీ 317 జీఓకు వ్యతిరేకంగా బీజేపీ కొట్లాడిందన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ వద్దనుకుంటే రాష్ట్రాలు ఆప్షన్ తీసుకోవచ్చని కేంద్రం చెప్పినా కేసీఆర్ తీసేయలేదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం తన విధానాన్ని ప్రకటించలేదని అన్నారు. ఇక ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ ఉండగా, పీఆర్‌సీ అమలుకు నోచుకోలేదన్నారు. అలాగే, ఉద్యోగ విరమణ చేసిన వారికి 15 నెలలుగా బకాయిలు రాని పరిస్థితి ఉందని చెప్పారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ దగా చేశాయని విమర్శించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్‌ను గెలిపిస్తే వారు ఒరగబెట్టింది ఏమీ లేదని, అపారమైన అనుభవం కలిగిన సరోత్తమ్‌రెడ్డిని గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి మండలిలో గళం ఎత్తుతారని ఈటల తెలిపారు. కాగా, ఆరు గ్యారంటీలు, 66 హామీల అమలుకోసం కొట్లాడుతామన్నారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా అసైన్డ్ భూములను లాక్కోవడం, హైడ్రా, మూసీ పేరుతో కూల్చివేస్తున్నారే తప్ప హామీల అమలుపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, సుభాష్‌రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతో పాటుచాడ శ్రీనివాస్, అల్లిక అంజయ్య, దొంగల సత్యనారాయణ, శ్యాంరాథోడ్, చెన్నకేశవరెడ్డి, డాక్టర్ పాపారావు, పుల్లారావు యాదవ్, మంద సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment