ఎమ్మెల్సీ పోలింగ్ సజావుగా సాగేలా ఏర్పాట్లు
ఖమ్మంసహకారనగర్: ఖమ్మం – నల్లగొండ – వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27న జరగకుండా సాఫీగా ముగిసేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం సెక్టార్ అధికారులు, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, ఓపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఎన్నికల విధులపై సందేహాలు ఉంటే ముందుగానే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన అనుభవం ఉన్నప్పటికీ ఏ మాత్రం ఏమరుపాటుగా ఉండొద్దని చెప్పారు. అనంతరం మాస్టర్ ట్రెయినీలు రాజేశ్వరి, ఎన్.మాధవి బ్యాలెట్ బాక్సుల సీల్, పోలింగ్ బూత్‌ల్లో ఏర్పాట్లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వామి, కలెక్టరేట్ ఎన్నికల డీటీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.
అడవిలో మంటల
నియంత్రణకు సహకరించాలి
కారేపల్లి: రానున్న ఎండాకాలంలో అటవీ ప్రాంతాన మంటల చెలరేగే అవకాశమున్నందున నియంత్రణకు రైతులు సహకరించాలని జిల్లా అటవీ శాఖాధికారి(డీఎఫ్‌ఓ) సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ సూచించారు. మండలంలోని తవిసిబోడులో గురువారం రైతులతో ఆయన సమావేశమయ్యారు. అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించి వివాదాలు, వ్యవసాయ క్షేత్రాలకు రోడ్డు సౌకర్యం, కోతుల బెడద తదితర అంశాలను రైతులు డీఎఫ్‌ఓ దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ అటవీ, ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూములకు హద్దులు నిర్ధారిస్తామని చెప్పారు. అలాగే, వన్యప్రాణులు అడవి దాటి రాకుండా పండ్ల మొక్కలు నాటుతామన్నారు. రైతులకు సౌర శక్తితో నడిచే బోర్ మోటార్ల సరఫరాకు ఐటీడీఏ అధికారులతో చర్చిస్తామని తెలిపారు. కాగా, అడవిలో మంటలు చెలరేగినప్పుడు సమాచారం ఇచ్చి అటవీ సంపదను కాపాడడంలో పాలుపంచుకోవాలని ఆయన కోరారు. ఇదేసమయాన స్థానికులు వాస్తవాలను అర్థం చేసుకుని అటవీ సంరక్షణలో భాగస్వామ్యం కావాలని సూచించారు. అటవీ శాఖ అధికారి మంజుల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment