
రజతోత్సవ సభకు కదం తొక్కాలి..
తిరుమలాయపాలెం: బీఆర్‌ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే సభకు పాలేరు నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో తరలివెళ్లాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశం గురువారం తిరుమలాయపాలెంలో నిర్వహించగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను విస్మరించడమే కాక ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యాన ప్రజలు బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన మంచిని గుర్తించారని తెలిపారు. రజతోత్సవ సభ తర్వాత బీఆర్‌ఎస్ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలాయపాలెం సహా నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా పనులు చేశామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, మరికంటి ధనలక్ష్మితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సన్నాహక సమావేశంలో ఎంపీ రవిచంద్ర