
12
రోజులు..
51
వేల దరఖాస్తులు
రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించడానికి విధించిన గడువు ముంచుకొస్తోంది.. కానీ సాంకేతిక సమస్యలు దరఖాస్తుదారులను వేధిస్తున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో ప్రకటించిన 25శాతం రాయితీ 30వ తేదీ వరకు అమలవుతుంది. ఈక్రమాన ఇబ్బందులకు గురిచేసిన ఐజీఆర్‌ఎస్(ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రీడ్రస్సెల్ సిస్టం) సమస్యకు పరిష్కారం చూపినా.. నిషేధిత జాబితాలో ఉన్న భూములపై స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో మిగిలిన 12రోజుల్లో 51,641 మంది ఫీజు కట్టగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
ఒకటి పరిష్కరించినా..
ఎల్‌ఆర్‌ఎస్ కింద 2020 ఆగస్టు 26కు ముందు రూ.వెయ్యి కట్టి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ఫీజులో రాయితీ కల్పించింది. ఈనెల 30వ తేదీ వరకు చెల్లిస్తే 25శాతం రాయితీ అమలుకానుండగా.. ఆది నుంచి ఈ పథకం నత్తనడకనే కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రకటనతో ఉత్సాహంతో కార్యాలయాలకు వచ్చేవారికి తొలినాళ్లలో ఐజీఆర్‌ఎస్(ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రీడ్రస్సెల్ సిస్టం) సమస్య ఇబ్బంది పెట్టింది. అయితే, ఈ సమస్యను సరిదిద్దేలా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకే ఆప్షన్ ఇచ్చారు. ఇక దరఖాస్తు చేసుకున్న పలువురి ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉండడం.. ఫీజు చెల్లింపునకు 12 రోజులే గడువు ఉండడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రొహిబిటెడ్ అవస్థలు
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు నిషేధిత జాబితా సమస్యగా పరిణమించింది. ప్రభుత్వ, ఇరిగేషన్ స్థలాలకు సంబంధించి సర్వే నంబర్లలో ఉన్న దరఖాస్తులను ఈ జాబితాలో చేర్చగా.. సమీప పట్టా భూములు కొన్నింటిని సైతం అదే జాబితాలో పెట్టారు. గతంలో నాగార్జునసాగర్ కెనాల్ కోసం జిల్లాలో భూసేకరణ జరిగింది. ఓ రైతుకు చెందిన పది ఎకరాల్లో ఒక ఎకరం సేకరిస్తే మిగిలిన భూమి సైతం ప్రభుత్వ భూమిగా నమోదైంది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ ఈ భూములను నిషేధిత జాబితా లో చేర్చడం ప్రస్తుత సమస్యకు కారణమవుతోంది.
6వేలకు పైగానే దరఖాస్తులు
ధరణి పోర్టల్ వచ్చినప్పటికీ నుంచి ప్రొహిబిటెడ్ సమస్య వేధిస్తోంది. గతంలో ఈ సమస్యపై కలెక్టర్లు దృష్టి సారించినా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ఇదే కారణంగా ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల్లో 5,685 దరఖాస్తులు, సుడా పరిధిలో 682దరఖాస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిషేధిత జాబితాలో ఉందా, లేదా అన్నది తేల్చాల్సి ఉండగా.. ఇది జరగడానికి ఎన్నాళ్లు పడుతుంది, ఆలోగా రాయితీ గడువు ముగిస్తే పరిస్థితి ఏమిటన్నది తెలియరావడం లేదు.
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపునకు అడ్డంకులు
ప్రొహిబిటెడ్ భూములపై
ఎటూ తేల్చని ప్రభుత్వం
జిల్లాలో ముందుకు సాగని ప్రక్రియ
ఐజీఆర్‌ఎస్ సమస్యకు మాత్రం పరిష్కారం
66,637 మందికి సమాచారం..
ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ కింద ఫీజు చెల్లించాలని 66,637 మందికి సమాచారం అందించారు. ఇందులో చాలామంది ముందుకొస్తున్నా రకరకాల కారణాలతో 14,996 మందే ఫీజు చెల్లించారు. ఇంకా 51,641 మంది 12రోజుల్లో ఫీజు చెల్లించడం కష్టమేనని తెలుస్తోంది. ఓ వైపు కొందరు దరఖాస్తుదారుల నిర్లిప్తత, మరోవైపు సాంకేతిక సమస్యలతో ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇక నిషేధిత జాబితాలో 6వేలకు పైగా దరఖాస్తుదారుల భూమి ఉండడంతో ప్రభుత్వమే పరిష్కారంమార్గం చూపాలని వారు కోరుతున్నారు.
ఖమ్మం కార్పొరేషన్, మున్సిపాలిటీలు, సుడా పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలు
పేరు దరఖాస్తులు పెండింగ్ ప్రొహిబిటెడ్
ఖమ్మం కార్పొరేషన్ 40,178 8,639 5,216
వైరా మున్సిపాలిటీ 3,531 158 –
మధిర 4,290 444 139
ఏదులాపురం 13,536 4,449 259
సత్తుపల్లి 3,690 118 71
సుడా 20,927 4,931 682
మొత్తం 86,152 19,739 6,367