సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనని నాయకులు ఆశల పల్లకిలో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనున్న తరుణంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు కానుంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి చోటు దక్కుతుందోనని సర్వత్రా ఆసక్తి మొదలైంది. ఈ మేరకు సీనియర్ నాయకుల ఎంపిక కోసం కసరత్తు జరుగుతోంది. సోమవారం సాయంత్రమే సీఎల్పీ నేత ఎన్నిక, కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా భావించారు. చివరికి సీఎం ఎంపికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జాప్యం జరుగుతోంది. కొత్త సర్కారులో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనేది తేలాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిర్మల్ నుంచి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న మంత్రులుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో పశ్చిమ జిల్లా నుంచే ఇద్దరికి అవకాశం వచ్చింది. కేబినెట్ హోదా ఉన్న ప్రభుత్వ విప్ పోస్టు మాత్రం తూర్పు జిల్లాకు ఇచ్చారు. ఈసారి పశ్చిమ జిల్లా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. మంచిర్యాల జిల్లా పరిధిలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఖానాపూర్ పరిధిలో మరొకరు ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ ఎమ్మెల్యేలకే కొత్త కేబినేట్‌లో చోటు దక్కనుంది. ఉమ్మడి జిల్లా నుంచే ఇద్దరిని మంత్రులుగా ఎంపిక చేస్తే ‘గడ్డం’ సోదరుల్లో ఒకరు, మరొకరు పీఎస్సార్ ఉండనున్నారు.
పోటీలో ‘గడ్డం’ బ్రదర్స్
నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు గడ్డం సోదరులైన వినోద్, వివేక్ మంత్రి రేసులో ఉన్నారు. వీరిలో ఒకరికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుచరులు చెప్పుకుంటున్నారు. చెన్నూరు నుంచి 2004 నుంచి 2009మధ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రభుత్వంలో గడ్డం వినోద్ మంత్రిగా పని చేశారు. తాజాగా వినోద్ బెల్లంపల్లి నుంచి ఎన్నికయ్యారు. వివేక్ తొలిసారిగా చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో పెద్దపల్లి నుంచి ఎంపీగా పని చేశారు.
పీఎస్సార్‌వైపు మొగ్గు?
టీపీసీసీ ఎన్నికల వ్యూహా రచన కమిటీ చైర్మన్‌గా ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పార్టీ పరిశీలనలో ఉండనున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టకాలంలో వెన్నంటే ఉండి బలోపేతం చేశారు. పది నియోజకవర్గాల్లోనూ ఆయనకు పట్టు ఉంది. పార్టీ పీఎస్సార్ పేరును ప్రధానంగా పరిశీలన చేస్తున్నట్లు చెబుతున్నారు. కేబినెట్ బెర్త్ ఖాయమని ఆయన వర్గీయులు విశ్వాసంగా ఉన్నారు. ఇక ఖానాపూర్ స్థానం నుంచి ఎన్నికైన ఆదివాసీ నాయకుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు మంత్రి పదవిపై ఆశలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment