వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి శనివారం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి వార్షిక ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ఇంటి నుంచి వస్తుంటారని, తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో ముఖ్యమైందన్నారు. ఇంటి వద్ద కూడా వారు సన్నద్ధమయ్యే విధంగా తల్లిదండ్రులు అనువైన వాతావరణం కల్పించాలని కోరారు. ఇంట్లో ఫోన్, టెలివిజన్ చూడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షల నేపథ్యంలో వ్యవసాయ పనులకు తీసుకెళ్లొద్దని సూచించారు. ఫలితాల్లో జిల్లాను ముందుంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో గమానియల్, డీటీడీవో రమాదేవి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సజీవన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment