ఎన్నికల జాగారం
● శివరాత్రి తెల్లారే ఎమ్మెల్సీ పోలింగ్ ● పట్టభద్రులు, టీచర్ అభ్యర్థుల ఆరాటం ● ప్రచారం ముగిసి తెరవెనుక మంత్రాంగం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మెదక్–కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరుకుంది. పోలింగ్‌కు 48గంటల ముందే ప్రచారం నిలిపి వేయాల్సి ఉండడంతో తెరవెనుకఅభ్యర్థుల మంత్రాంగం మొదలైంది. నాలుగు పాత జిల్లాల్లోని మొత్తం 42అసెంబ్లీ స్థానాల పరిధిలో జరుగుతున్న పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసారి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోటీలో ఉన్న వారందరూ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్ల మొగ్గుపై ఆసక్తి కొనసాగుతోంది. తమ అభ్యర్థుల విజయం కోసం ఆయా పార్టీల రాష్ట్ర అగ్రనాయకత్వం ప్రచారంతో హోరెత్తించింది. గత ఎన్నికల కంటే ఈసారి మరింత దూకుడుగా అభ్యర్థులు తలపడుతున్నారు. ప్రచారంలో ఒకరిని మించి మరొకరు హామీలు ఇస్తూ ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. నేడు శివరాత్రి పండుగ ముగిసి, గురువారం ఉదయం 8నుంచే బ్యాలెట్ పేపర్‌పై ప్రాధాన్యత క్రమాన్ని ఓటర్లు వేయడం మొదలవుతుంది. దీంతో అభ్యర్థులు ఎన్నికల జాగారం చేయాల్సి వస్తోంది.
టీచర్ల స్థానానికి హోరాహోరీ
ఉపాధ్యాయ స్థానానికి మొత్తం 15మంది బరిలో ఉండగా, ఇందులో బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్టీయూ టీఎస్ నుంచి వంగ మహేందర్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఉమ్మడి జిల్లా నుంచి ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉన్న పీఆర్‌టీయూ ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, టీఎస్‌సీపీఎస్‌ఈ యూనియన్ బలపర్చిన తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డితో సహా స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీపీఎస్(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు, 317జీవో, డీఏలు మెడికల్ రీయింబర్స్‌మెంట్స్ పెండింగ్, పే స్కేల్, పదోన్నతుల సమస్యలే ప్రచారంలో చర్చకు వచ్చాయి. అందరూ హామీలే ఇచ్చినప్పటికీ టీచర్లు ఎవరికి పట్టం కడుతారనే ఆసక్తి నెలకొంది. గతంలో మద్దతు తెలిపిన సంఘ సభ్యులందరూ ఒకే అభ్యర్థికి ఓట్లు వేసిన దాఖలాలు లేవు. చాప కింద నీరులా కొందరు అభ్యర్థులు తెరవెనుక మంత్రాంగం నడిపించి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా ఓటర్లకు తాయిలాలు అందే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా విందులు నడుస్తున్నాయి.
పట్టభద్రుల ప్రసన్నం కోసం
కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్‌రెడ్డి, బీజేపీ మద్దతుతో అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణతో సహా మొత్తం 56మంది బరిలో ఉన్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక నాయకులు చెమటోడుస్తున్నారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ప్రచారం చేశారు. బీఎస్పీ నుంచి పోటీలో ఉన్న ప్రసన్న హరిక్రిష్ణ బీసీ నినాదంతో ముందుకు వస్తున్నారు. వీరితోపాటు బక్క జడ్సన్ పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే బహిరంగ సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. అంతేకాక ఎవరికివారు సామాజిక మాధ్యమాలు, ఫోన్లు, మేసేజ్‌లు, వాట్సాప్‌ల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ నెలకొనడంతో పట్టభద్రులు తమ ప్రాధాన్యతను ఎలా వ్యక్తపరుస్తారనేది ఆసక్తిగా మారింది. పట్టభద్రుల ప్రసన్నం కోసం చివరి అస్త్రంగా నగదు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment