కాకతీయుల విజయానికి చిహ్నం
వాంకిడి: మండల కేంద్రంలోని చిక్లీ వాగు వద్ద కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం చరిత్రకు చిహ్నంగా, భక్తుల కొంగుబంగారంలా నిలుస్తోంది. మహాశివరాత్రి పర్వదినాన చిక్లీ వాగు తీరంలో నిర్వహించే జాతరకు ఆలయాన్ని విద్యుత్ వెలుగులతో ముస్తాబు చేశారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడిని పోలి ఉండటంతో శివరాత్రి రోజున భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. కాకతీయుల చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే కట్టడాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మరాఠా రాజులతో జరిగిన యుద్ధంలో రాణి రుద్రమదేవి కొన్నిరోజుల పాటు వీరోచిత పోరాటం సాగించి వారిని మహారాష్ట్ర సరిహద్దులోని వాంకిడి వరకు తరిమికొట్టినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. కాకతీయుల విజయానికి చిహ్నంగా వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీ వాగు ఒడ్డున శివకేశవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆలయం నిర్మాణంలో భారీ రాతి బండలు వినియోగించారు. ఓరుగల్లు నుంచి ఏనుగుల సాయంతో వాటిని ఇక్కడికి తెప్పించి ఆలయ నిర్మాణానికి వాడినట్లు చరిత్రకారులు గుర్తించారు. అందువల్లే ఆలయం వేయి స్తంభాల గుడిని పోలి ఉంటుంది. స్తంభాలు, సీ్త్రల నృత్య భంగిమలు, గుడి ముఖద్వారం వద్ద నంది విగ్రహం, విడివిడిగా ఏర్పాటు చేసిన అనేక విగ్రహాలు ఆకట్టుకుంటాయి. శివ, కేశవులు ఒకేచోట ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. మరో వైపు రేణుక మాత విగ్రహాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. మహాశివరాత్రికి కెరమెరి, కాగజ్‌నగర్, రెబ్బెనతో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నుంచి భారీగా తరలివస్తారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు, చిక్లీ వాగు తీరంలో రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రంగా భజనలతో జాగరన చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment