తమ్ముడిని దింపి వస్తానని వెళ్లి..
● కానరాని లోకాలకు సోదరుడు ● రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో మృతి ● ఒకరికి తీవ్రగాయాలు
భీమిని: ‘అమ్మా.. తమ్ముడిని దింపి త్వరగా పని చూసుకుని వస్తా’అని చెప్పిన బయటకు వెళ్లిన పది నిమిషాలకే కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. చేతికందిన కొడుకును రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. కన్నెపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని పోలంపల్లి వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..భీమిని మండలంలోని వీగాం గ్రామానికి చెందిన దుర్గం దేవాజీ–శంకరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు దుర్గం రాజేశ్ (29) కొరియర్ సర్వీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు అభిలాష్ బెల్లంపల్లిలో ఇంటర్ చదువుతున్నాడు. కూతురికి వివాహమైంది. ప్రతీరోజు లాగా రాజేష్, సోదరుడు అభిలాష్‌ను బైక్‌పై వీగాం బస్టాండ్‌లో దింపేందుకు వెళ్లాడు. అప్పటికే బస్సు వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు కలిసి టేకులపల్లి క్రాస్‌రోడ్డు వద్దకు బయల్దేరారు. బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన పెట్టెం శ్రవణ్‌కుమార్ తన తండ్రి అంజయ్యతో కలిసి బైక్‌పై కన్నెపల్లి వైపు వేగంగా వస్తున్నాడు. పోలంపల్లి వద్ద రాజేశ్ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజేశ్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. అభిలాష్ చెయ్యి విరిగి తీవ్రగాయాలపాలయ్యాడు. శ్రవణ్‌కుమార్, అంజయ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కన్నెపల్లి ఎస్సై గంగారాం, సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయాలైన అభిలాష్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. రాజేశ్ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి దేవాజీ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తమ్ముడిని దింపి వస్తానని వెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment