ఎమ్మెల్సీ ఎన్నికలకు సైన్యం సిద్ధం
● 250మంది పోలీసులతో బందోబస్తు ● జిల్లాలో 58 పోలింగ్ కేంద్రాలు
మంచిర్యాలక్రైం: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 27న జరిగే పోలింగ్‌లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం బందోబస్తుకు సిద్ధమైంది. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ పర్యవేక్షణలో 250మంది బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లాలోని 21 ప్రాంతాల్లో 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు మంగళవారం సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుందని, ఈ నెల 25న సాయంత్రం 4గంటల నుంచి 27న సాయంత్రం 4గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని పేర్కొన్నారు. ముగ్గురు ఏసీపీలు, 12మంది సీఐలు, 21మంది ఎస్సైలు, 212మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటారు.
విధుల్లో అలసత్వం ప్రదర్శించొద్దు
నస్పూర్: ఎన్నికల విధుల్లో పోలీసు సిబ్బంది అలసత్వం ప్రదర్శించొద్దని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. గురువారం పోలింగ్ నేపథ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై మంగళవారం ఆయన పట్టణ పరిధిలోని ఏఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment