ప్రశాంతంగా పోలింగ్
ఆసిఫాబాద్: మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8:00 గంటల నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, పురుషులతో పాటు యువత ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగింది. గడువులోగా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారిని ఓటు వేసేందుకు అనుమతించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎన్నికల నిర్వహణకు 19 మంది ప్రిసైడింగ్ అధికారులు, 87 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 17 మంది సూక్ష్మపరిశీలకులను నియమించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను కరీంనగర్‌లోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు.
4,970 మంది ఓటుహక్కు వినియోగం
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4,970 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 6,137 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా 4,546 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 3,278 మంది పురుషులు, 1,268 మంది మహిళలు ఉన్నారు. దీంతో పోలింగ్ సమయం ముగిసేంత వరకు 74.08 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఓటర్లు 470 మంది ఉండగా 424 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 288 మంది పురుషులు, 136 మంది మహిళలు ఉన్నారు. దీంతో 90.21 శాతం పోలింగ్ నమోదైంది.
ఫలితాలపై ఉత్కంఠ
ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తుండగా లోలోన ఆందోళన కూడా అంతేస్థాయిలో ఉంది. ప్రధాన పార్టీల ఇన్‌చార్జీలు ఓటింగ్ సరళిపై బేరీజు వేసుకుంటున్నారు. గురువారం సాయంత్రానికి పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి ఫలితాలపైకి మరలింది. జిల్లా అంతటా ఫలితాలపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. గ్రామాలు, పట్టణాల్లో ఎవరు గెలుస్తారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల విజయావకాశాలపై చర్చలు ఊపందుకున్నాయి. ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులతో పాటు సంబంధిత పార్టీల నాయకుల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిని పరిశీలించారు.
ఓటుహక్కు వినియోగించుకున్న కలెక్టర్
జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నామన్నారు.
జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల పాఠశాలలో బారులు తీరిన ఓటర్లు
జిల్లాలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
ఉదయం నుంచే పోటెత్తిన ఓటర్లు
పట్టభద్రులు 74.08, టీచర్లు 90.21 శాతం నమోదు
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ప్రశాంతంగా పోలింగ్
ప్రశాంతంగా పోలింగ్
ప్రశాంతంగా పోలింగ్
ప్రశాంతంగా పోలింగ్
ప్రశాంతంగా పోలింగ్
Comments
Please login to add a commentAdd a comment