మరింత ఉపాధి
● 2025–26 ఆర్థిక సంవత్సరానికి పెరిగిన పని దినాలు ● వ్యవసాయ, మౌలిక సదుపాయాలకు పెద్దపీట
తిర్యాణి: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2005లో ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సంబంధిత పనులతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుడుతోంది. జాబ్‌కార్డు కలిగి ఉన్న ప్రతీ కుటుంబానికి వందరోజుల పనిదినాలను కల్పించాలనే లక్ష్యంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అధికారులు ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే ప్రణాళికలను పూర్తి చేశారు. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో లక్ష్యానికి మించి పనిదినాలు పూర్తి చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మరింత ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పనిదినాల లక్ష్యాన్ని పెంచారు.
44,33,277 రోజుల పనిదినాలు లక్ష్యం
ఉపాధి హామీ పథకం కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 38,71,840 పనిదినాలను కల్పించాలని లక్ష్యం ఏర్పాటు చేసుకోగా ఇప్పటికే లక్ష్యానికి మించి పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనుల గుర్తింపు కోసం ఇప్పటికే ఊరూరా ఉపాధిహామి గ్రామసభలు నిర్వహించి పనుల గుర్తింపు చేపట్టారు. కాగా రాబోయే ఆర్థిక సంవత్సరంలో 44,33,277 పనిదినాలను చేపట్టాలని లక్ష్యంగా ఏర్పాటు చేసుకోగా అందుకుగానూ కూలీల చెల్లింపుల కోసం రూ.132.99 కోట్ల వ్యయం ఖర్చు చేయనున్నట్లు అంచనా వేశారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముఖ్యంగా వ్యవసాయ సంబంధిత పనులైన కుంటల తవ్వకం, పంట చేలకు వెళ్లేందుకు రోడ్లు వేయడం, గట్టలు పోయడం, కందకాల తవ్వకం, చెరువుల్లో పూడికతీత, చేపల కుంటల తవ్వకంలాంటి పనులతో పాటు రైతులకు అవసరమైన పనులను సైతం నిర్వహించనున్నారు. జిల్లాలో అధికంగా నిరుపేదలు ఉండటంతో ఉపాధి పనులు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి. జిల్లాలో ప్రస్తుతం కూలి రెట్లు సరాసరిగా రూ.214 చెల్లిస్తున్నారు. మరింత పెంచితే ఉపాధిహామి కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది
ప్రణాళికలు సిద్ధంచేశాం
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాకు కేటాయించిన నిధులు వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. పని అడిగిన ప్రతీ కూలీకి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే ఏడాది 44,33,277 పనిదినాలను పూర్తి చేయాలని లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం.
– దత్తారాం, డీఆర్‌డీవో, ఆసిఫాబాద్
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనిదినాలు, కూలి చెల్లింపు అంచనా వ్యయం
మండలం పనిదినాల కూలీలకు చెల్లింపులు
లక్ష్యం (రూ.కోట్లలో)
ఆసిఫాబాద్ 3,31,600 9.95
బెజ్జూర్ 4,64,060 13.92
చింతలమానెపల్లి 2,18,134 6.54
దహెగాం 3,81,624 11.44
జైనూర్ 2,84,114 8.52
కాగజ్‌నగర్ 2,90,975 8.72
కెరమెరి 4,24,150 12.74
కౌటల 3,42,800 10.28
లింగాపూర్ 1,65,220 4.95
పెంచికల్‌పేట్ 1,65,068 4.95
రెబ్బెన 3,41,384 10.24
సిర్పూర్(టి) 2,08,658 6.25
సిర్పూర్(యూ) 2,09,000 6.27
తిర్యాణి 3,25,917 9.77
వాంకిడి 2,80,453 8.41
మొత్తం 44,33,277 132.99
మరింత ఉపాధి
Comments
Please login to add a commentAdd a comment