సరిహద్దులో తేలని పట్టా
● రైతుల గోస పట్టేదెవరికి..? ● ఎడతెగని 12 గ్రామాల వివాదం ● సాగు భూమి పట్టాల కోసం నిరీక్షణ ● 2013 వరకు అందిన పహానీలు ● ఆన్‌లైన్, ధరణి కల్పించిన చిక్కులు ● 18 వేల ఎకరాల్లో 2 వేల మంది రైతులు
కెరమెరి(ఆసిఫాబాద్): తెలంగాణ, మహారాష్ట్ర రా ష్ట్రాల సరిహద్దులోని 12 గ్రామాల్లో రెండు రాష్ట్ర ప్ర భుత్వాల పాలన సాగుతోంది. అయినప్పటికీ ఆయా గ్రామాల రైతులు అసౌకర్యాలతో కొట్టుమి ట్టాడాల్సి వస్తోంది. ఆయా గ్రామాల్లో ఎలాంటి ఆ దాయ వనరులు లేకపోవడంతో వ్యవసాయమే జీవనాధారంగా బతుకీడుస్తున్నారు. ఎలాంటి పరి శ్రమలు, కుటీర పరిశ్రమలు లేవు. ఉన్న వ్యవసా యం చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అనాదిగా ఆయా భూముల్లో సాగు చేస్తున్నా నేటికీ ఏ ప్రభుత్వం కూడా పట్టాలు అందించలేకపోయింది. ఫలితంగా ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలను అందుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం అటవీ భూముల్లో సాగు చేస్తున్న రైతుల భూములకు పట్టాలిస్తామని ప్రకటించింది. సర్వే కూడా చేయించింది. దీంతో రైతులు పట్టాలపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అధిక మంది రైతులు ఎస్సీ కులానికి చెందిన వారు ఉండడం, 1930కి ముందు నుంచి స్థానికంగా ఉంటూ ఆధారాలు చూపాలి. అప్పటి ఆధారాలు లేకపోవడంతో ఒక్కరికి కూడా పట్టా అందలేదు.
2013 వరకు పహానీలు!
ఆ ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్న భూమి అధిక భాగంగా అటవీశాఖకు చెందింది. కాగా కొంతభాగం మాత్రమే రెవెన్యూ భూమి అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 1995 నుంచి 2013 వరకు ఆయా గ్రామాలకు చెందిన రైతులకు మ్యాన్యువల్‌గా పహానీలను రెవెన్యూ అధికారులు ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పహనీలు అందుబాటులోకి రావడంతో వీరికి లభించలేదు. దీంతో రైతులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆందోళనలు చేస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఫలింతగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలు అందక వ్యాపారుల వద్ద నుంచి వడ్డీలకు డబ్బులు తీసుకొని సాగు చేస్తున్నారు.
ఆధారాలు లభించలేదు.
2023లో సంయుక్తంగా అటవీ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్వే చేసినా సరైన ఆధారాలు లభించలేదు. గిరిజనేతర రైతులు 1930కి ముందు నుంచి అటవీ భూముల్లో సాగు చేస్తున్నట్లు, గిరిజనులు 2005 నుంచి సాగు చేస్తున్నట్లు ఆధారాలు చూపించాలి. గిరిజనేతరుల్లో 5శాతం రైతులకు కూడా 70 ఏళ్ల కిందటి ఆధారాలు లభించలేదు. అప్పటి నుంచి ఉన్న వృద్ధుల వాంగ్మూలం, పురాతన బావులు, శ్మశాన వాటికలు, ఆధార్ కార్డులు, ఓటర్‌ఐడీ కార్డులు, పురాతన కట్టడాలు తదితర 10 ఆధారాలు చూపించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. గిరిజనులకు ఏదోలా అక్కడక్కడ లభిస్తున్నా గిరిజనేతరులకు 70 ఏళ్ల క్రితం నాటి ఆధారాలు లభించ లేదు.
18,374 వేల ఎకరాల్లో 1,878 మంది రైతులు
సరిహద్దులోని వివాదాస్పద పరంధోళి, ముకదంగూడ, అంతాపూర్, భోలాపటార్ గ్రామ పంచాయతీల్లో 12 గ్రామాలకు చెందిన 1,878 మంది రైతులు ఉన్నారు. వారంతా సుమారు 18,374 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సాగు చేస్తున్న రైతుల్లో 476 మంది రైతులు గిరిజనులు కాగా.. 1,300 మంది ఎస్సీలు, 102 మంది బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారున్నారు. అనేక ఏళ్ల నుంచి ఆయా గ్రామాల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని తమ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వారందరి ప్రధాన వృత్తి వ్యవసాయమే కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
వ్యవసాయమే జీవనాధారం..
సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ వ్యవసాయమే జీవనాధారం. పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి రైతులకు అందే సంక్షేమ పథకాలు అందుకోలేక పోతున్నాం, అనేక ప్రభుత్వాలు వస్తున్నా మాదొక్కటే డిమాండ్. అదే సాగు చేస్తున్న భూములకు పట్టాలు కావాలని. ఏ ఒక్క ప్రభుత్వం మా సమస్యను తీర్చలేకపోతోంది.
– పతంగే లింబాదాస్, మాజీ సర్పంచ్, ముకదంగూడ
బతకడం కష్టమవుతోంది..
అనాదిగా ఉన్న భూములను సాగు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాం. ఏదో ఒక రోజు ప్రభుత్వం పట్టాలు ఇవ్వక పోతుందా అన్న నమ్మకంతో ఉన్నాం. కానీ గత ప్రభుత్వం 70 ఏళ్ల నాటి ఆధారాలు చూపెట్టాలని ఆంక్షలు విధించడంతో ఆశలు నీరుగారాయి. ప్రస్తుత ప్రభుత్వం స్పందించాలి. కనీసం అధికారులు పహనీలైనా ఇవ్వాలి. దీని వల్ల బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– కాంబ్డె లక్ష్మణ్, రైతు, పరంధోళి
సరిహద్దులో తేలని పట్టా
సరిహద్దులో తేలని పట్టా
సరిహద్దులో తేలని పట్టా
Comments
Please login to add a commentAdd a comment