మా కాలేజీలో చేరండి..! | - | Sakshi
Sakshi News home page

మా కాలేజీలో చేరండి..!

Published Sun, Mar 2 2025 12:58 AM | Last Updated on Sun, Mar 2 2025 12:57 AM

మా కా

మా కాలేజీలో చేరండి..!

● ఇంటర్‌ ప్రవేశాల పెంపునకు కార్యాచరణ ● ప్రచారం చేపట్టిన ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు ● ఇప్పటికే 1,085 మంది విద్యార్థుల గుర్తింపు ● ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై వారికి అవగాహన

పదో తరగతి వార్షిక పరీక్షలకు సమయం సమీపిస్తోంది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు ‘పది’ విద్యార్థులకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ఇంటర్‌ బోర్డు సైతం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు ఉన్నత పాఠశాలల్లో ప్రచారం చేస్తున్నారు. ఉచిత విద్య, సర్కారు కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరిస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల సంఖ్య పెంపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

కెరమెరి(ఆసిఫాబాద్‌): వివిధ కారణాలతో ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరంలో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ప్రభుత్వ అర్హులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్యనందిస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నా అవగాహన లోపంతో కొందరు ప్రైవేట్‌కే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అడ్మిషన్ల పెంపుపై ఇంటర్‌ బోర్డు దృష్టి సారించింది. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతోపాటు వసతిగృహాల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు. పది వార్షిక పరీక్షల కంటే ముందే ఆయా కళాశాలల అధ్యాపకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. జూనియర్‌ కళాశాలల ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.

‘సర్కారు’లో మెరుగైన వసతులు

జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఫస్టియర్‌లో 4,758 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 5,396 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆయా కళాశాలల్లో చాలా వరకు మెరుగైన వసతులు ఉన్నాయి. ఉన్నత విద్య పూర్తిచేసిన నిపుణులైన అధ్యాపకులు ఉన్నారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియాల్లో పలు కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. గతంతో పోల్చితే వసతులు, బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెరిగాయి. కళాశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. వార్షిక పరీక్షలపైనే కాకుండా విషయ పరిజ్ఞానంపై దృష్టి సారించి విద్యార్థులకు బోధిస్తున్నారు.

ప్రవేశాలు పెంచేందుకే..

రానున్న విద్యా సంవత్సరంలో జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు బో ర్డు అధికారుల ఆదేశాల మే రకు మండలాల్లోని ఉన్నత పాఠశాలల్లో ప్రచారం చేస్తున్నాం. అనేక పాఠశాలల్లోని విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వెయ్యికి పైగా విద్యార్థుల వివరాలు సేకరించాం. గతేడాది కంటే ఈ ఏడాది ప్రవేశాలు పెంచేందుకు కృషి చేస్తాం.

– సీహెచ్‌ కళ్యాణి, డీఐఈవో

గోయగాం ఉన్నత పాఠశాలలో ప్రచారం చేస్తున్న అధ్యాపకులు

ప్రవేశాల ప్రచారం కోసం వెళ్లిన అధ్యాపకులు

103 మంది

జిల్లా

వివరాలు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు

11

ప్రవేశానికి

ఆసక్తి చూపిన విద్యార్థులు

1,085

ప్రైవేట్‌ కంటే ముందే..

జిల్లాకు చెందిన విద్యార్థులు స్థానిక ప్రైవేట్‌ కళాశాలతోపాటు మంచిర్యాల, కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ వంటి పట్టణాల్లో ఇంటర్‌ పూర్తిచేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల యజమాన్యాలు తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ర్యాంకుల ఆశ చూపి రూ.లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. ప్రైవేట్‌ కళాశాలల యజమాన్యాలు వేసవి నుంచే ప్రచారం చేస్తూ విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ ఉన్నతాధికారుల కూడా 2025– 26 విద్యా సంవత్సరం ప్రవేశాలపై అప్రమత్తమయ్యారు. ప్రతీ కాలేజీలో 25 నుంచి 40 శాతం ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గ్రామాల్లో డ్రాపౌట్స్‌ లేకుండా కార్యాచరణ సిద్ధం చేశారు. ఉన్నత పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలతో పాటు తల్లిదండ్రుల పేర్లు, వారి మొబైల్‌ నంబర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇలా సేకరించిన వివరాలు, ప్రచారం తీరు, విద్యార్థుల నుంచి వస్తున్న స్పందన, ఇతర వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మా కాలేజీలో చేరండి..!1
1/1

మా కాలేజీలో చేరండి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement