‘భూసారం’ తెలిసేదెలా! | - | Sakshi
Sakshi News home page

‘భూసారం’ తెలిసేదెలా!

Published Sun, Mar 2 2025 12:58 AM | Last Updated on Sun, Mar 2 2025 12:57 AM

‘భూసా

‘భూసారం’ తెలిసేదెలా!

● రైతువేదికల్లో అందుబాటులో లేని కిట్లు ● పరీక్షలు చేసేవారు లేక రైతుల అవస్థలు ● మోతాదుకు మించి రసాయన ఎరువుల వినియోగం

రెబ్బెన(ఆసిఫాబాద్‌): సాగు భూముల్లో సారం తెలుసుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. భూములు ఏ తరహా పంటల సాగుకు అనుకూలం, పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయి.. తదితర వివరాలు తెలిస్తే మరింత దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది. భూముల రకం, అందులోని సారానికి అనుగుణంగా సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులు సైతం తగ్గుతాయి. కానీ ఏళ్లుగా తమ అనుభవంతో మాత్రమే అన్నదాతలు ఎరువులు వాడుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం భూసార పరీక్షలపై శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా సాగు పెట్టుబడులు పెరుగుతున్నాయి.

పెరిగిన రసాయన ఎరువుల వాడకం

ప్రస్తుతం వ్యవసాయంలో రసాయన ఎరువుల వా డకం విపరీతంగా పెరిగింది. మోతాదు మించి ఎరువులు వినియోగిస్తుండటంతో భూసారం దెబ్బతింటోంది. రైతులపై అదనపు ఆర్థికభారం పడుతోంది. ఆశించిన దిగుబడి రాక అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అప్పులు తీర్చే మార్గం తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అధిక దిగుబడి సాధించాలనే ఆశతో వినియోగించే రసాయన ఎరువులు పర్యావరణంపై సైతం ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. భూసార పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహిస్తే రైతులతో పాటు పర్యావరణానికి సైతం మేలు జరగనుంది.

ఆసక్తి ఉన్నా..

కొంతమంది రైతులు భూసార పరీక్షలు చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆ సౌకర్యం అందుబాటులో లేకపోవటంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. జిల్లాలోని రైతులు సుమారు 4.5లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. గతంలో వ్యవసాయశాఖ అధికారులే దగ్గరుండి రైతులు సాగుచేసే భూముల్లో ఒక పద్ధతిలో తవ్వి మట్టి నమూనాలు సేకరించి వాటికి పరీక్షలు నిర్వహించేవారు. కచ్చితత్వంతో కూడిన ఫలితాలు రైతులకు ఉపయోగకరంగా మారేవి. ఇప్పుడు భూసార పరీక్షలు చేయించుకునే రైతే భూమిలో మట్టి నమూనాలు సేకరించి సంబంధిత వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాలి. వారు ఆదిలాబాద్‌ తీసుకెళ్లి అక్కడ భూసార పరీక్షలు చేయిస్తున్నారు. రైతుల సెల్‌ఫోన్‌కు సందేశం రూపంలో ఫలితాలను పంపిస్తారు. మట్టి నమూనా సేకరణ చేపట్టే పద్ధతిపై సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇష్టారీతిన నమూనాలు సేకరిస్తుండటంతో ఫలితాల్లో కచ్చితత్వం లోపిస్తోంది. మట్టి నమూనాలు సేకరించి సంబంధిత అధికారులకు అప్పగించడం వంటి పనులు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు.

రైతులు కోరితే పరీక్షలు

భూసార పరీక్షలు చేయాల ని రైతులు కోరితే తప్పనిసరిగా చేయించి ఫలితాలు రై తులకు తెలియజేస్తాం. అ యితే రైతులు మట్టి నమూనాలు తీసుకువచ్చి ఇస్తే వాటిని ల్యాబ్‌కు పంపిస్తాం. ప్రస్తుతానికి జిల్లాలో భూసార పరీక్షలకు సంబంధించిన ల్యాబ్‌ అందుబాటులో లేదు. ఆదిలాబాద్‌లోని ల్యాబ్‌కు నమూనాలు పంపించి పరీక్షలు చేయిస్తున్నాం.

– శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి

రైతువేదికల్లో నిలిచిన పరీక్షలు

రాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పంటల సాగుకు కావా ల్సిన సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు అందించడంతోపాటు అవగాహన సదస్సులు, సమావేశాల నిర్వహణ కోసం ప్రతీ వ్యవసాయ క్లస్టర్‌కు ఒకటి చొప్పున రైతువేదికలు నిర్మించింది. క్లస్టర్‌ పరిధిలోని రైతుల భూముల్లో సారా న్ని తెలుసుకునేందుకు వీలుగా ప్రతీ రైతువేదిక కు భూసార పరీక్షల కిట్లు పంపిణీ చేసింది. కొన్ని నెలలపాటు భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలు రైతులకు తెలియజేశారు. ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేశారు. భూమిలో పోషకాలను బట్టి తగిన మోతాదులో రసాయనిక ఎరువులు వినియోగించేవారు. అనంతర కాలంలో ప్రభుత్వం రైతువేదికల వద్ద భూసార పరీక్షల నిర్వహణకు అవసరమైన రసాయనాల పంపిణీ నిలిపివేసింది. భూసార పరీక్షలు సైతం నిలిచిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవటంతో రైతువేదికలకు ఇచ్చి కిట్లు సైతం కనుమరుగైపోయాయి. ప్రస్తుతం భూసార పరీక్షలు అందని ద్రాక్షగా మిగిలిపోయాయి. భూసార పరీక్షలు కీలకమైనా ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
‘భూసారం’ తెలిసేదెలా!1
1/1

‘భూసారం’ తెలిసేదెలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement