‘మూడో’ అడుగు
జైపూర్: జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ) విస్తరణకు మరో అడుగు పడింది. ఎట్టకేలకు మూడో యూనిట్(800 మెగావాట్ల) థ ర్మల్ వపర్ ప్లాంటు నిర్మాణానికి మోక్షం కలిగింది. పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ మళ్లీ బీహెచ్‌ఈఎల్ కంపెనీ కొత్త ప్లాంటు బీటీజీ, బీవోపీ నిర్మాణ పనుల టెండర్లు దక్కించుకుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాకనే ఆలస్యం అన్నట్లుగా ఎస్టీపీపీ అధికార యంత్రాంగం పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తోంది. 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటును విస్తరిస్తూ మూడో యూనిట్ నిర్మాణానికి సంస్థ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2010లో రెండు యూనిట్ల(600+600మెగావాట్లు) థర్మల్ పవర్ ప్లాంటు పనులు ప్రారంభించగా.. 2017లో పూర్తయ్యాయి. రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి నిరంతర విద్యుత్ వెలుగులు పంచుతోంది. రెండో దశలో మూడో యూనిట్ నిర్మాణానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్ 2015లోనే పనులకు శంకుస్థాపన చేశారు. డీపీఆర్ తయారు చేసి టెండర్ల దశకు వెళ్లడానికి ఏళ్లు గడువగా.. గత ఏడాది మొదటిసారి వేసిన టెండర్లను రద్దు చేసి ఈ ఏడాది మళ్లీ టెండర్లు పిలిచారు. మళ్లీ అదే బీహెచ్‌ఈఎల్ కంపెనీ బీటీజీ, బీవోపీ నిర్మాణ పనుల టెండర్లు దక్కించుకుంది. రూ.6,700కోట్ల వ్యయంతో కొత్త ప్లాంటు 800మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటును రెండు యూనిట్లకు ముందు భాగంలో నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగియడంతో ప్లాంటు నిర్మించే స్థలాన్ని అధికారులు చదును చేస్తున్నారు. ఇక ఏ క్షణంలోనైనా సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది.
సింగరేణికి సిరులు..
కొత్త ప్లాంటుతో సింగరేణి సంస్థకు సిరులు కురిపించనుంది. బొగ్గు అధారిత థర్మల్ పవర్ ప్లాంటు కావడంతో విద్యుత్ ఉత్పత్తికి ప్రధానంగా బొగ్గు, నీరు అవసరం. ఇప్పటికే సింగరేణి సంస్థ అవసరానికి మించి ఇక్కడ భూముల సేకరణ చేపట్టడం, షెట్‌పల్లి గోదావరి నది నుంచి 1టీఎంసీ నీరు, కోటపల్లి మండలం దేవులవాడ నుంచి 2టీఎంసీల నీరు పైపులైన్ల ద్వారా పవర్‌ప్లాంటుకు తరలిస్తున్నారు. ఇక సంస్థకు చెందిన భూగర్భగనులు, ఓసీపీ ఉండడం, శ్రీరాంపూర్ సీహెచ్‌పీ నుంచి ఎస్టీపీపీ బొగ్గు రవాణాకు శాశ్వతంగా రైల్వేట్రాక్‌లైన్ నిర్మించి బొగ్గు తరలిస్తున్నారు. రెండు యూనిట్ల నిర్వహణకు బొగ్గు, నీరు తరలించడానికి ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి ఉండడం, కొత్త ప్లాంటు నిర్మిస్తుండడంతో మూడో యూనిట్ నిర్వహణ చేపట్టడం చాలా సులభతరం కావడంతోపాటు భారీగా ఖర్చు కూడా తగ్గనుంది. బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తి రంగంలో దూసుకెళ్తూ దేశ స్థాయిలో సింగరేణి సంస్థ తన చరిత్ర తిరగరాస్తోంది. ఓ పక్కన థర్మల్ పవర్ ప్లాంటు మరో పక్కన సోలార్ ప్లాంట్ల నిర్మాణంతో సింగరేణి విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది.
మరో 5వేల మందికి ఉపాధి..
కొత్త ప్లాంటు నిర్మాణంతో 5వేల మందికిపైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలుగనుంది. రెండు యూనిట్లలో ఇప్పటికే స్థానిక భూనిర్వాసితులు సుమారు వెయ్యిమంది ఆయా విభాగాల్లో పని చేస్తుండగా పలు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు 500మందికిపైగా పని చేస్తున్నారు. ఇప్పటికే స్థానికులకు 80శాతం ఉపాధి అవకాశాలు కల్పించడానికి సంస్థ ఉత్తర్వులు ఇవ్వడంతో కొత్త ప్లాంటులో స్థానిక నిరుద్యోగులకు బోలెడు ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి.
పదేళ్ల నిరీక్షణకు తెర
ఎస్టీపీపీలో మరో ప్లాంటు నిర్మాణం
రూ.6,700 కోట్ల వ్యయం.. 800 మెగావాట్లు
సింగరేణి సిగలో మరో వెలుగుల నగ
బీహెచ్‌ఈఎల్‌కే ప్లాంటు నిర్మాణ పనులు
‘మూడో’ అడుగు
Comments
Please login to add a commentAdd a comment