బొక్కివాగు ప్రాజెక్టు వివరాలు | - | Sakshi
Sakshi News home page

బొక్కివాగు ప్రాజెక్టు వివరాలు

Published Mon, Mar 3 2025 12:12 AM | Last Updated on Mon, Mar 3 2025 12:11 AM

బొక్కివాగు ప్రాజెక్టు వివరాలు

బొక్కివాగు ప్రాజెక్టు వివరాలు

● కబ్జాకు గురవుతున్న బొక్కివాగు ప్రాజెక్టు భూములు ● యాసంగిలో యథేచ్ఛగా పంటల సాగు ● ఏటా పెరుగుతున్న ఆక్రమణలు ● అధికారుల పర్యవేక్షణ లోపంతో అన్యాక్రాంతం!

సేకరించిన భూమి 334 ఎకరాలు

వ్యయం రూ.18కోట్లు

లక్ష్యం రెండు వేల

ఎకరాలకు సాగునీరు

ఆక్రమణకు గురైన భూమి

సుమారు 60 నుంచి 100 ఎకరాలు

చెల్లించిన పరిహారం

ఎకరాకు రూ.1.50లక్షలు

పెంచికల్‌పేట్‌(సిర్పూర్‌): రైతులకు సాగు నీరందించాలనే సంకల్పంతో పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూర్‌ సమీపంలోని బొక్కివాగుపై 2012లో నిర్మించారు. అధికారుల నిర్లక్ష్యంలో ప్రాజెక్టు లక్ష్యం నీరుగారే ప్రమాదం పొంచి ఉంది. ప్రాజెక్టు శిఖం భూములను కొంతమంది ఆక్రమించుకుంటూ పంటలు సాగు చేస్తున్నారు. మరికొందరు శిఖం భూములను సాగు చేయడమే కాక ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు సంబంధించిన సుమారు 60 ఎకరాల వరకు భూమి ఆక్రమణకు గురైంది. అధికారులు పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ప్రాజెక్టు సామర్థ్యం తగ్గడంతో పాటు రూపురేఖలు కనుమరుగయ్యే అవకాశాలు లేకపోలేదు.

యాసంగిలో జోరుగా సాగు..

వానాకాలం సీజన్‌లో ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు నీటి మట్టం పెరిగింది. ఆక్రమణదారులు పక్కాగా యాసంగి సీజన్‌లో ఎక్కువ మొత్తంలో శిఖం భూములను ఆక్రమించుకుని పంటలను సాగు చేయడానికి అవకాశం ఏర్పడింది. మరోవైపు ఎండాకాలంలో శిఖం భూముల్లో ఇష్టారీతిన ట్రాక్టర్‌తో ఎకరాల కొద్ది భూములను చదును చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 నుంచి 100 ఎకరాలు శిఖం భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.

సర్వేకు వెనుకడుగు

ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందింది. గత ప్రభుత్వంలో నిర్వహించిన భూరికార్డుల సమగ్ర సర్వేలో ప్రాజెక్టులో కోల్పోయిన భూములను రికార్డుల నుంచి తొలగించాల్సి ఉంది. అధికారుల తప్పిదంతో ప్రాజెక్టులో భూములను కోల్పోయిన పలువురికి నేటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. కొంతమంది అధికారులు భూఆక్రమణదారులకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి.

అధికారుల పర్యవేక్షణ లోపం..!

ప్రాజెక్టు నిర్మాణానికి సేకరించిన ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారుల సమన్వయ లోపంతో ప్రాజెక్టు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రాజెక్టు భూముల్లో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేస్తే శిఖం భూములకు రక్షణ కల్పించవచ్చు. అధికారులు సర్వే నిర్వహించి శిఖం భూములను రక్షించాలని స్థానిక ప్రజలు, రైతులు కోరుతున్నారు.

హద్దులు చెరిపి..

ప్రాజెక్టు నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన భూముల్లో హద్దులు నిర్ణయించిన సంబంధిత అధికారులు యజమానులకు నగదు అందించారు. అనంతరం ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణదారులకు కలిసి వస్తోంది. వర్షాకాలంలో ప్రాజెక్టులో చేరిన నీటిని ముందుగానే తూముల నుంచి వృథాగా వదిలేస్తున్నారు. నీటిమట్టం తగ్గగానే ట్రాక్టర్‌లతో శిఖం భూములు చదును చేయిస్తూ పంటలు సాగు చేస్తున్నారు. సాగు పేరుతో అక్రమార్కులు ఇష్టారీతిన శిఖం భూములను ఆక్రమించుకుంటున్నారు. ఏటా భూములు స్వాహా అవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

ఆక్రమిస్తే చర్యలు

శిఖం భూములను కబ్జా చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రా జెక్టు భూముల్లో సర్వే నిర్వహించి సేకరించిన భూమికి హద్దులు ఏర్పాటు చేస్తాం. ప్రాజెక్టు భూములను ఆక్రమించినా, క్రయవిక్రయాలు జరిపినా కేసులు నమోదు చేస్తాం. ప్రాజెక్టు భూముల రక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలి.

– ప్రభాకర్‌రావు, ఈఈ, ఇరిగేషన్‌

హద్దులు ఏర్పాటు చేయాలి

ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గడంతో కొంతమంది వ్యక్తులు భూములను చదును చేస్తూ ఆక్రమణలు సాగిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి విలువైన శిఖం భూములు ఆక్రమిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టు భూముల్లో హద్దులు ఏర్పాటు చేయాలి.

– పాలె సంతోష్‌, పెంచికల్‌పేట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement