నిఘా నీడలో పరీక్షలు
● ఈ నెల 5న ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షలు ● హాజరుకానున్న 10,054 మంది విద్యార్థులు ● ‘సాక్షి’తో డీఐఈవో కళ్యాణి
ఆసిఫాబాద్‌రూరల్: ‘విద్యార్థి భవిష్యత్తును మలుపుతిప్పే ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అన్నిఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో 19 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 10,054 మంది పరీక్షలు హాజరుకానున్నారు. విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి..’ అని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కళ్యాణి అన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పరీక్ష ఏర్పాట్ల వివరాలు వెల్లడించారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా కేంద్రం లోపలికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
సాక్షి: ఈ ఏడాది జిల్లాలో ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు? ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు?
డీఐఈవో: ప్రథమ సంవత్సరంలో 4,758 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,296 మంది, మొత్తంగా 10,054 మంది పరీక్షలు రా యనున్నారు. ఇందులో జనరల్ విభాగంలో 8,524 మంది, ఒకేషనల్ విభాగంలో 1,530 మంది ఉన్నారు. వీరి కోసం 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం.
సాక్షి: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు?
డీఐఈవో: అన్ని పరీక్ష కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫ్యాన్లు, వెలుతురు కోసం లైట్లు, ఫర్నిచర్ సౌకర్యాలు కల్పించాం. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇంటర్నెట్, కంప్యూటర్ ప్రింటర్, గైర్హాజరైన విద్యార్థుల సమాధాన పత్రాల బార్‌కోడ్‌లను స్కానింగ్ చేసి ఎప్పటికప్పుడు బోర్డు వెబ్‌సైట్‌కు సమాచారం పంపించే ఏర్పాటు చేశాం. వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటారు.
సాక్షి: ఫలితాలపై మీ అంచనా ఏమిటి? విద్యార్థులను పరీక్షల కోసం ఏ మేరకు సంసిద్ధం చేశారు?
డీఐఈవో: గతేడాది రాష్ట్రంలోనే జిల్లా తృతీయ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా ప్రథమస్థానంలో నిలిచేలా విద్యార్థులను సిద్ధం చేశాం. ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. జూనియర్ కళాశాలల్లో అకాడమిక్ మానిటరింగ్ టీం ఆధ్వర్యంలో నిరంతరం విద్యార్థుల మార్కులపై దృష్టి సారిస్తూ ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి ప్రశ్నాపత్రాల నమూనాలపై ఎప్పటికప్పుడు తగిన శిక్షణ ఇస్తున్నాం.
సాక్షి: మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
డీఐఈవో: ప్రతీ పరీక్ష కేంద్రంలో ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వాటిని సెంటర్ నుంచి ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేశాం. కెమెరాల నిఘాలోనే ప్రశ్నపత్రాలు ఓపెన్ చేస్తారు. సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు సైతం నిర్వహించనున్నాం. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. డిపార్టుమెంట్ బృందం, ఫ్లయింగ్‌స్క్వాడ్, జూనియర్ లెక్చరర్లు, రెవెన్యూ, ఏఎస్సై, జిల్లా పరీక్ష కమిటీ, అదనపు కలెక్టర్ నిత్యం తనిఖీలు నిర్వహిస్తారు. కాపీయింగ్‌ను ప్రోత్సహించే వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.
సాక్షి: ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతిస్తారా?
డీఐఈవో: విద్యార్థులు 30 నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. 15 నిమిషాల ముందే జవాబు పత్రం అందస్తారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పించనున్నారు.
సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి?
డీఐఈవో: విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలి. ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలి. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలి.
నిఘా నీడలో పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment