సింగరేణి.. ఇక పేపర్ లెస్!
శ్రీరాంపూర్: సింగరేణిలో త్వరలో పేపర్‌లెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగులకు నిరీక్షణ తిప్పలు తప్పనున్నాయి పర్యావరణ పరిరక్షణ, టెక్నాలజీ అందిపుచ్చుకునే చర్యల్లో భాగంగా సింగరేణి అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఫైల్‌లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ పేరుతో పేపర్ రికార్డుల స్థానంలో కంప్యూటర్ రికార్డులను సిద్ధం చేశారు. ఉద్యోగులకు సంబంధించిన ఇప్పటి వరకు పేపర్ ఫైల్‌లో ఉన్న రికార్డులన్నీ డిజిటలైజేషన్ అయ్యాయి. ఇక నుంచి ఏ వివరాలు కావాలన్నా కంప్యూటర్‌లో క్లిక్ చేస్తే సమస్త సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాని ద్వారానే ఉద్యోగి కోరిన విధంగా ఫార్వర్డ్ చేసి సమాచారం అందించడం, పంచుకోవడం చేస్తారు. ఈ మేరకు కార్పొరేట్ నుంచి అన్ని ఏరియాలకు ఆదేశాలు అందాయి.
డిజిటలైజేషన్ పూర్తి...
పేపర్ లెస్‌సేవల కోసం ఏళ్లుగా పేపర్లలో నిక్షిప్తమై ఉన్న ఉద్యోగుల పర్సనల్ రికార్డు(ఈపీఆర్)లన్నీ కంప్యూటర్ ప్రోగ్రాం శాప్‌లో అప్‌లోడ్ చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తి కావడంతో దానికి అనుగుణంగా సేవలు మొదలు కానున్నాయి. ఉద్యోగి అపాయింట్‌మెంట్ తేదీ, అతని మస్టర్లు, పొందిన ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు, ఎల్‌టీసీ, ఎల్‌ఎల్‌టీసీ, జీతభత్యాలు, పనిష్మెంట్లు, రివార్డులు ప్రతీది కూడా కంప్యూటర్‌లో నిక్షిప్తం చేశారు. రిటైర్మెంట్‌కు ముందు అతనికి ఎంత మొత్తం చెల్లింపులు చేయాలో కూడా కంప్యూటర్ క్లిక్ చేసి చెబుతారు. ఈపీఆర్ రికార్డులో ఉన్న ఉద్యోగి కుటుంబ సభ్యులు పేర్లతోపాటు వారి తల్లిదండ్రులు, భార్య పిల్లల ఫొటోలు కూడా స్కానింగ్ చేసి కంప్యూటర్‌లో నిక్షిప్తం చేశారు. దీనిని డిజిటలైజేషన్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సిస్టం(డీఎంఎస్) అని కూడా పిలుస్తారు. దీనితోపాటు హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సర్వీస్(హెచ్‌ఎంఎస్) వివరాలు కూడా శాప్‌లో ఎంట్రీ చేశారు.
నిరీక్షణకు తెర..
ఇప్పటి వరకు ఉద్యోగి తన వ్యక్తిగత రికార్డులు, వివరాలు కావాలని అధికారులను కోరితే దానిని తీసి ఇవ్వడానికి రెండు, మూడు రోజులు పట్టేది. కుప్పలుగా ఉన్న ఫైల్స్ వెతకడం, వాటిని తీసి ఇవ్వడం ప్రయాసగా ఉండేది. పేపర్ రికార్డులతో కొన్ని సందర్భాల్లో అవకతవకలు కూడా జరిగాయి. ఇప్పుడు ఏమాత్రం జాప్యం లేకుండా క్షణాల్లో ఇవ్వనున్నారు. ఇక నుంచి ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేదు. పత్రాల్లో ఉన్నవి కంప్యూటర్‌లో ఎక్కించే ముందే ఉద్యోగుల నుంచి పూర్తి సమాచారం మరోసారి చెక్ చేసుకుని ఎంట్రీ చేశారు. ఉద్యోగులు కోరిన సవరణలు కూడా చేశారు. వారు ఓకే అన్న తర్వాతే ఆ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేశారు. దీంతో ఇక రికార్డులన్నీ పూర్తి పారదర్శకంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఏరియా ఆసుపత్రుల నుంచి మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను, రోగులను కార్పొరేట్ ఆస్పత్రులకు రెఫర్ చేసే సమయంలో ఉద్యోగి పనిచేసే చోట నుంచి వారి ఫొటోలతో కూడా ఫాంలు తెచ్చి ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది తప్పింది. నేరుగా ఏరియా ఆస్పత్రుల నుంచి రెఫర్ చేసే అవకాశం కలిగింది. ఉద్యోగులకు సంబంధించి ఏవైనా డబ్బులు సెటిల్‌మెంట్ చేసే సమయంలో కార్పొరేట్ అధికారులు నేరుగా కంప్యూటర్‌లో క్లిక్ చేసి నిర్ణయాలు తీసుకునే వీలు కలిగింది.
ఏప్రిల్ 1 నుంచి అమలు
సింగరేణిలో పేపర్ లెస్ సేవలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అన్ని ఏరి యాల్లో రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయింది. సమ స్త సమాచారం కంప్యూటర్ తెరపై క్షణాల్లో పొందవచ్చు. దీంతో సేవలు మరింత మెరుగవుతాయి.
– ఎం.శ్రీనివాస్, జీఎం, శ్రీరాంపూర్
పూర్తయిన రికార్డుల డిజిటలైజేషన్
ఉద్యోగులకు తప్పనున్న నిరీక్షణ
ఏప్రిల్ 1 నుంచి అమలు
Comments
Please login to add a commentAdd a comment