పేదల భూముల్లో అక్రమ దందా! | - | Sakshi
Sakshi News home page

పేదల భూముల్లో అక్రమ దందా!

Published Fri, Mar 7 2025 9:45 AM | Last Updated on Fri, Mar 7 2025 9:41 AM

పేదల

పేదల భూముల్లో అక్రమ దందా!

● నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూముల్లో క్వారీలు ● ఎన్‌వోసీ ఇచ్చిన రెవెన్యూ అధికారులు ● నష్టపోతున్న రైతులు

కౌటాల(సిర్పూర్‌): కొందరు వ్యక్తులు ధనదాహంతో పేదల సంపదను కొల్లగొడుతున్నారు. నిరుపేదలు సాగు చేసుకోవడానికి ప్రభుత్వం గతంలో పంపిణీ చేసిన భూముల్లో క్వారీలు నిర్వహిస్తూ దందా సాగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధి కారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కౌటాల మండలం ముత్తంపేట గ్రామ శివారులో నాలుగు స్టోన్‌ క్రషర్లు ఉన్నాయి. వీటికి బండరాళ్లు తవ్వడం కోసం క్వారీలు నడుస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్థానిక ప్రజలు బ్లాస్టింగ్‌లతో భయంభయంగా గడుపుతున్నారు. క్వారీల యజమానులు పేలుడు పదార్ధాల విషయంలో ఇష్టారీతినా వ్యహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్‌ స్టేషన్లకు సమాచారం ఇవ్వకుండానే పని కానిస్తున్నారు. బ్లాస్టింగ్‌ విషయంలో లెక్కాపత్రం లేకుండా పోయింది. గనులశాఖ సైతం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి.

నిబంధనలపై పట్టింపేది..?

కౌటాల మండలం ముత్తంపేట సమీపంలో 8 కంకర క్వారీలు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఐదు హెక్టార్లకు మించి విస్తీర్ణంలో ఉంటే రాష్ట్రస్థాయి అధికారులు, అంత కంటే తక్కువగా ఉంటే క్వారీల నిర్వహణకు కలెక్టర్‌, ఆర్డీవో, కాలుష్య నియంత్రణ మండలి, డీఎఫ్‌వోలతో పాటు మరో 12 మంది అధికారులు పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటేనే అనుమతులు జారీ చేస్తారు. సదరు భూములు సాగుకు యోగ్యంగా లేవని, అసైన్డ్‌ కావని, తహసీల్దార్‌ ఎన్‌వోసీ జారీ చేస్తారు. క్వారీలు గ్రామాలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని కాలుష్య నియంత్రణ మండలి ఈసీ ఇచ్చిన తర్వాతే తవ్వకాలు ప్రారంభించాలి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అసైన్డ్‌ భూముల్లో ఏర్పాటు

కౌటాల మండలం చందారం శివారులోని సర్వే నంబర్‌ 22లో పూర్తిగా ప్రభుత్వ భూమి ఉంది. ఇందులోనే వందల ఎకరాలను పేద ప్రజలకు అసైన్డ్‌ చేశారు. ప్రస్తుతం ఈ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు కొనసాగుతున్నాయి. ‘క్వారీల ఏర్పాటుకు భూములు ఇస్తే ఎంతోకొంత నగదు వస్తుంది.. లేకుంటే నయాపైసా రాదు’ అంటూ నిర్వాహకులు రైతులను భయపెట్టారు. అధికారులు, పోలీసుల చుట్టూ అన్నదాతలు తిరిగి గత్యంతరం లేక భూములు అప్పగించారు. అప్పటినుంచి నిత్యం తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన అధికార బృందం.. పూర్తి అసైన్డ్‌ భూముల్లో క్వారీల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారు. కొందరు రెవెన్యూ, గనులశాఖ అధికారులు మామూళ్లకు ఆశపడి అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ఒక్కరే సర్వేయర్‌ ఉండటంతో క్వారీల తనిఖీలు పూర్తిస్థాయిలో చేపట్టడం లేదు. దీంతో కంకర తరలింపుపై లెక్కాపత్రం లేకుండా పోతోంది. అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా సాగుతున్న ఈ కంకర క్వారీలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేలుళ్ల ధాటికి భారీ బండరాళ్లు పంట చేలలోకి వచ్చి పడుతున్నాయి. సమీపంలో ఉన్న ముత్తంపేట గ్రామంలో ఇళ్లు పగుళ్లు తేలుతున్నాయి. కంకర తరలించే వాహనాలతో సిర్పూర్‌(టి) మండలంలో రోడ్లు గుంతలమయంగా మారాయి. కొత్తగా వేసిన రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి.

అసైన్డ్‌ భూముల్లోనే..

కౌటాల మండలంలోని చందారం శివారులో అసైన్డ్‌ భూములు ఉన్నాయి. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు ఏర్పాటు చేశారు. పేదరైతుల భూముల్లోని సంపదను కొల్లగొడుతున్నారు. క్రషర్‌ యజమానులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

– ఆదే వసంత్‌రావు, ముత్తంపేట, కౌటాల

ఎన్‌వోసీ ఇవ్వలేదు

నేను విధుల్లో చేరినప్పటి నుంచి ముత్తంపేట సమీపంలో క్వారీల ఏర్పాటుకు ఎలాంటి ఎన్‌వోసీ ఇవ్వలేదు. క్వారీలు తనిఖీ చేసి.. ఏ భూమిలో ఏర్పాటు చేశారో పరిశీలిస్తాం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం.

– పుష్పలత, తహసీల్దార్‌, కౌటాల

No comments yet. Be the first to comment!
Add a comment
పేదల భూముల్లో అక్రమ దందా!1
1/3

పేదల భూముల్లో అక్రమ దందా!

పేదల భూముల్లో అక్రమ దందా!2
2/3

పేదల భూముల్లో అక్రమ దందా!

పేదల భూముల్లో అక్రమ దందా!3
3/3

పేదల భూముల్లో అక్రమ దందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement