నిధులు రాక నిరుపయోగం
ఆసిఫాబాద్‌రూరల్: వ్యవసాయ క్లస్టర్ల పరిధిలోని రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు అందించేందుకు గత ప్రభుత్వం నిర్మించిన రైతువేదికల నిర్వహణ గాడితప్పింది. సర్కారు నుంచి నిధులు విడుదల కాకపోవడంతో వాటి పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, 70 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. రైతులకు సాగులో ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్, తదితర అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించేందుకు 15 మండలాల్లో 70 రైతు వేదికలు నిర్మించారు. ఒక్కో దాని నిర్మాణానికి రూ.22 లక్షలు వెచ్చించారు. ఈ రైతు వేదికల నిర్వహణకు నెలకు కనీసం రూ.8 వేల నుంచి రూ.10 వేలు ఖర్చవుతుంది. గత ప్రభుత్వం 2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల పాటు సక్రమంగా నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు నిధుల విడుదల నిలిచిపోయింది. అప్పటి నుంచి వాటి నిర్వహణను పట్టించుకునే వారు కరువయ్యాయి. నిర్వహణ ఏఈవోలకు తలకు మించిన భారంగా మారింది. విద్యుత్ బిల్లులు, ఇతర ఖర్చులు వారు సొంతంగా చెల్లించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది.
గ్రామాలకు దూరంగా నిర్మాణం
జిల్లాలో 70 రైతువేదికలు ఉన్నాయి. నాలుగు నుంచి ఐదు పంచాయతీలను కలుపుకుని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి క్లస్టర్ ఒక రైతువేదిక నిర్మాణం చే పట్టారు. ఇందులో చాలావరకు గ్రామాలకు దూరంగా ఉండటంతో రైతులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్ సర్కారు ప్రతీ మంగళవా రం రైతునేస్తం కార్యక్రమం పేరుతో పంటల సాగు విధానంలో నూతన పద్ధతులు, అధిక దిగుబడి వి ధానాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయాధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మండలానికి ఒకటి చొప్పున 15 రైతువేదికలను ఇందు కోసం వినియోగిస్తున్నారు. మిగిలినవి నిరుపయోగంగా ఉంటున్నాయి. కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయిలో బిల్లులు కూడా అందకపోవడంతో కొన్నిచో ట్ల మరుగుదొడ్లు నిర్మించలేదు. మరికొన్ని చోట్ల అసంపూర్తిగానే ఉన్నాయి. తాగు నీటి సదుపాయం లేదు. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
ఎంపిక చేసిన రైతువేదికల్లో ప్రస్తుతం ప్రతీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ రైతులను ఆహ్వానిస్తున్నాం. రైతువేదికల స్థితిగతులపై ఉన్నతాధికారులకు నివేదిక అందించాం. నిధులు మంజూరు కాగానే వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి
గ్రామాలకు దూరంగా రైతువేదికలు
15 చోట్ల వీడియో కాన్ఫరెన్స్ సేవలు
మిగిలినవి అలంకారప్రాయమే..
Comments
Please login to add a commentAdd a comment