జిల్లాకు ఇంటిగ్రేటెడ్ గురుకులం
● ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు ● వాంకిడి మండలం ఇందాని శివారులో స్థలం పరిశీలన ● రూ.200 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆసిఫాబాద్‌రూరల్: పేదరికాన్ని రూపుమాపే ఏకై క ఆయుధం విద్య మాత్రమే.. పేద కుటుంబాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వాంకిడి మండలం ఇందాని సమీపంలో ప్రభు త్వ స్థలాన్ని ఇటీవల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, అధికారులు తదితరులు పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ గురుకులం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
స్థలం గుర్తింపు
బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు 25 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన భవనాలు నిర్మించనున్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులందరూ ఒకే చోట చదువుకునేందుకు వీలుగా వసతులు కల్పించనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఆదివాసీ జిల్లాలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 25 ఎకరాల స్థలం అందుబాటులో లేకపోవడంతో వాంకిడి మండలం ఇందాని గ్రామ శివారులో 321 సర్వే నంబర్‌లో 20 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు జిల్లా కేంద్రానికి సమీపంలో నిర్మిస్తే అన్ని మండలాల విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అలాగే సిర్పూర్ నియోజకవర్గంలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటుపై స్పష్టత రావాల్సి ఉంది.
జిల్లాలో పరిస్థితి..
జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు కలిపి మొత్తం 1,265 ఉన్నాయి. ఇందులో కళాశాలలు 17, పాఠశాలలు 1,248. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆయా చోట్ల 1,03,264 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐదు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2,898 మంది విద్యార్థులు, ఏడు గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2,917 మంది, 38 ఆశ్రమ పాఠశాలల్లో 7,065 మంది, 15 కేజీబీవీల్లో 3,917 మంది, ఐదు బీసీ జ్యోతిబా పూలే గురుకులాల్లో 2,215 మంది, మూడు మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 1,185 మంది, రెండు మోడల్ స్కూళ్లలో 1,304 మంది, 19 ఎస్సీ, బీసీ పోస్ట్ మెట్రిక్, ప్రీమెట్రిక్ వసతి గృహలు, ఎస్సీ బాలబాలికల వసతి గృహాల్లో 385 మంది, 11 బీసీ వసతి గృహల్లో 789 మంది, 107 ప్రైవేట్ పాఠశాలల్లో 29,779 మంది, 732 ప్రభుత్వ పాఠశాలల్లో 43,110 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండాలి
ఆసిఫాబాద్‌కు సమీపంలో చాలా వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయి. జిల్లా కేంద్రం పరిధిలో ఐదు కి.మీ.ల దూరంలో సమీకృత గురుకులం ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. ఆదర్శ డిగ్రీ కళాశాలను బెండారలో ఏర్పాటు చేయడంతో దూరభారంతో విద్యార్థులు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.
– తిరుపతి, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి
జిల్లాకు ఇంటిగ్రేటెడ్ గురుకులం
Comments
Please login to add a commentAdd a comment