
మద్యంతో ప్రమాదాలు..
కౌటాల మండలం తాటిపల్లి వద్ద పెన్‌గంగలో స్నానాలు(ఫైల్)
చింతలమానెపల్లి(సిర్పూర్): చిన్నాపెద్ద, కుల, మత బేధం లేకుండా హోలీ పండుగను అంతా కలిసి ఉల్లాసంగా జరుపుకొంటారు. సామూహికంగా జరుపుకునే ఈ పండుగకు క్రేజ్ ఎక్కువే. రంగులు చల్లుకుంటూ విందులు, వినోదాలతో సంతోషంగా గడపుతుంటారు. జిల్లావ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో పౌర్ణమి సందర్భంగా రెండు రోజులపాటు హోలీ నిర్వహించుకుంటారు. విభిన్న ఆచారాలు ఉన్నప్పటికీ హోలీ పండుగ కొత్త అలవాట్లకు వేదికగా మారుతుంది. సంబురాల అనంతరం యువత ఎక్కువగా స్నానాలకు వెళ్తుంటారు. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో నదులు, వాగులు, చెరువులు, కుంటలు, నీటిప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. రంగులు చల్లుకున్న అనంతరం స్నానాలకు వెళ్లడం సర్వసాధారణం. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వట్టివాగు, అడ ప్రాజెక్టు, పెద్దవాగుకు స్నానాలకు వెళ్తుంటారు. కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, దహెగాం మండలాల ప్రజలు సమీపంలోని పెద్దవాగు, ప్రాజెక్టులు, సిర్పూర్(టి), కౌటాల మండలాల్లో పెన్‌గంగ నది వద్దకు, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల వాసులు ప్రాణహిత నదికి స్నానాలకు వెళ్తుంటారు.
నిత్యం నీటి ప్రవాహం
జిల్లాలోని జీవనదులైన పెద్దవాగు, ప్రాణహిత, పెన్‌గంగ నదుల్లో ఏడాదంతా నీటి ప్రవాహం కొనసాగుతోంది. అడ, వట్టివాగు ప్రాజెక్టుల్లో నిత్యం జలకళ ఉంటుంది. సమీపంలోని గ్రామాల్లోని ప్రజలు పండుగ వేళల్లో స్నానాలకు నీటి వనరుల వద్దకు వెళ్లడం సాధారణ విషయం. పెద్దవాగు, ప్రాణహిత, పెన్‌గంగ నదుల్లో పలుచోట్ల ప్రమాదకర మడుగులు, ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం ఉంటుంది. హోలీ జరుపుకునే వారు గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
హోలీ సమయంలో ప్రమాదాలకు ఆస్కారం ఉండటంతో కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోని చిన్నపిల్లలు, యువకులు ప్రాణా ల విలువ గుర్తించే విధంగా అవగాహన కల్పించాలి. ముందస్తుగా హెచ్చరించడం ద్వారా ప్రమాదాల బారినపడకుండా అప్రమత్తంగా ఉంటారు. నదులు, వాగుల వద్ద ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి. అవసరమైన చోట నీటిమట్టం సూచించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలి. గతంలో ప్రమాదాలు జరిగిన ప్రదేశాలు, ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటే చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి.
జిల్లావ్యాప్తంగా రేపు హోలీ సంబురాలు
వాగులు, నదుల వద్ద స్నానాలు
నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలకు ఆస్కారం
హోలీ వేడుకల్లో మద్యం సేవించడం, విందులు జరుపుకోవడం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇవి శృతిమించితే రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. మద్యం తాగి నదులకు స్నానాలకు వెళ్లేటప్పుడు అత్యుత్సాహంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు మార్కెట్‌లో రంగులు ప్రమాదకరంగా ఉంటున్నాయి. రసాయన రంగులు వినియోగించడం ద్వారా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. మార్కెట్‌లో ఎక్కువగా కాఫర్‌సల్ఫేట్, కాల్షియం క్రోమియం, లిరాకై ్సడ్ వంటి రసాయనాలను సాధారణంగా బట్టలకు రంగులు వేయడానికి వినియోగిస్తుంటారు. వీటిని చర్మంపై చల్లుకోవడం ద్వారా చర్మ సంబంధమైన వ్యాధులు, కళ్లలో పడితే కంటి సంబంధిత వ్యాధులు, ముక్కు, నోటిద్వారా శ్వాసనాళాల్లోకి వెళ్లినా, జీర్ణాశయంలోకి వెళ్లినా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వీటిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సహజంగా ప్రకృతి పదార్థాలతో తయారు చేసే రంగులను వినియోగించడం శ్రేయస్కరం.
గతేడాది హోలీ పండుగ కౌటాల మండలంలో విషాదం నింపింది. పండుగ సంబురాల అనంతరం నదికి స్నానానికి వెళ్లిన కౌటాల మండల కేంద్రానికి ముగ్గురు యువకులు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. పండుగ రోజు చేతికందిన కుమారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబాలు తీరని దుఃఖంలో మునిగిపోయాయి.. పండుగ సమయంలో ఏమరుపాటుగా ఉంటే జరిగే ప్రమాదాలకు ఈ ఘటన నిదర్శనం.. ఈ నెల 14న హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక కథనం.
ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా ప్రజలు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు వేడుకలు ముగించుకోవాలని సూచించారు. ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు, నీటిని చల్లొద్దన్నారు. నీటి బెలూన్లు, గాజు పొడి కలిపిన రంగులను వాడొద్దన్నారు. మద్యం మత్తులో అల్లర్లు చేయడం నిషేధమని, మద్యం తాగి వాహనాలు నడపొద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యలు చేపడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.