● ఎండల తీవ్రతతో అడవుల నుంచి మైదానాల్లోకి మూగజీవులు ● విద్యుత్ తీగలు అమర్చి హతమారుస్తున్న వేటగాళ్లు ● పెద్దపులికి పొంచి ఉన్న ప్రమాదం ● కట్టడి చేయడంలో అటవీశాఖ అధికారుల వైఫల్యం
ఇటీవలి సంఘటనలు..
● ఈనెల 2న నందిగామ వద్ద అడవి జంతువులను హతమార్చేందుకు విద్యుత్ తీగలను అమర్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీ సుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
● ఈ నెల 14న అగర్‌గూడ బీట్‌లో నీలుగాయిని వేటాడిన నలుగురు వ్యక్తులపైన కేసు నమోదు చేసి వేటాడటానికి ఉపయోగించిన విద్యుత్ తీగలు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు.
● ఈనెల 15న రాత్రి లోడుపల్లిలో చుక్కల దుప్పిని హతమార్చిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దుప్పి చర్మం స్వాధీనం చేసుకున్నారు
● వారం రోజుల కిత్రం కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ ఆలయం వద్ద ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంక్ వద్దకు దప్పిక తీర్చుకునేందుకు వచ్చిన జింకను వేటగాళ్లు ఉచ్చులు అమర్చి హతమార్చారు.
పెంచికల్‌పేట్: వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్న జిల్లాలో మూగజీవాల వేట యధేచ్ఛగా కొనసాగుతోంది. అటవీశాఖ అధికారులు అడపాదడపా దాడులు నిర్వహించి వేటగాళ్లపైన కేసులు నమోదు చేస్తున్నా వారి తీరుమారడం లేదు. జిల్లాలో 6,04,172 ఎకరాల్లో దట్టమైన అటవీ విస్తీర్ణం ఉంది. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్‌ల పరిధిలో అనేక రకాల వన్యప్రాణులు ఆవాసంగా మార్చుకుని జీవనం సాగిస్తున్నాయి. ఇటీవల మండుతున్న ఎండలకు అటవీ ప్రాంతాల్లో నీటి వనరులు ఎండిపోవడంతో వన్యప్రాణులు వనం నుంచి మైదాన ప్రాంతాల్లోకి వస్తున్నాయి.. గ్రామ సమీపాల్లోని చెరువులు, నీటి కుంటలు, సెలయేర్ల వైపు పరుగులు పెడుతున్నాయి. దీంతో వేటగాళ్ల కన్ను వన్యప్రాణులపై పడింది. దీంతో విద్యుత్ తీగలు, ఉచ్చులు అమర్చి వాటిని హతమారుస్తున్నారు. వాటి మాంసాన్ని విక్రయిస్తూ వేటనే వృత్తిగా ఎంచుకున్నారు. పెంచికల్‌పేట్ రేంజ్‌లో మూడు రోజుల్లో మండలంలోని అగర్‌గూడ బీట్‌లో నీలుగాయిని, లోడుపల్లి వద్ద చుక్కల దుప్పిని వేటగాళ్లు హతమార్చారు.
కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో..
కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని పెంచికల్‌పేట్, బెజ్జూర్, సిర్పూర్(టి), కాగజ్‌నగర్, కౌటాల రేంజ్ ల పరిధిని ఆనుకుని ప్రాణహిత, పెద్దవాగు ప్రవహిస్తున్నాయి. దీంతో వేసవిలో సైతం వన్యప్రాణులు ఆయా రేంజ్‌ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఆవా సం ఏర్పాటు చేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో పెద్దపులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, చు క్కల దుప్పులు, జింకలు, నీలుగాయిలు, మెకాలు, సాంబార్లు, కొండగొర్రెలతో పాటు అనేక రకాల ప్రాణులు ఆవాసంగా మార్చుకుని సంతతి వృద్ధి చేసుకుంటున్నాయి. అధికారులు అటవీ ప్రాంతాల్లో గడ్డి క్షేత్రాల పెంపకం చేపడుతుండడంతో సహజంగానే శాఖాహార జంతువుల సంఖ్య పెరిగింది.
గ్రామాల వైపు పరుగులు..
ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో అడవుల్లోని సహజ నీటి వనరుల్లో నీటి లభ్యత తగ్గిపోయింది. వనం నుంచి వచ్చిన ప్రాణులు గ్రామాల సమీపంలో ఉన్న వనరుల వద్ద దాహం తీర్చుకుంటున్నాయి. ఎల్లూర్ సమీపంలోని బొక్కివాగు ప్రాజెక్టు, లోడుపల్లి సమీపంలోని ప్రాణహిత కెనాల్, అగర్‌గూడ సమీపంలోని పెద్దవాగు వైపు వస్తున్నాయి. దీంతో వేటగాళ్లు ముఠాగా ఏర్పడి విద్యుత్ తీగలు, ఉచ్చులు, కుక్కలతో దాడులు చేసి సులువుగా హతమారుస్తున్నారు.
కేసుల నమోదుతో సరి..
వన్యప్రాణులను వేటాడుతున్న వేటగాళ్లపై అటవీశాఖ అధికారులు అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నా వేట నిరంతరం సాగుతూనే ఉంది. అటవీ ప్రాంతంలో నీటి వసతి కల్పించి వన్యప్రాణులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నీటి కొరకు బయటికి వస్తున్న వన్యప్రాణులను వేటగాళ్లు సులువుగా హతమారుస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
సంరక్షణకు చర్యలు
ఎండలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో వన్యప్రాణులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. సహజ వనరులను అభివృద్ధి చేస్తున్నాం. నీరు లభించే ప్రాంతాల్లో చెలిమెలు ఏర్పాటు చేస్తున్నాం. అడవుల్లో సోలార్ పంపు సెట్ల ద్వారా నీటిని నింపుతున్నాం. క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నాం. వన్యప్రాణులను వేటాడే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం. వన్యప్రాణుల సంరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలి.
– సుశాంత్ బొగాడే, ఎఫ్‌డీవో, కాగజ్‌నగర్
పులికి పొంచి ఉన్న ప్రమాదం..
పెంచికల్‌పేట్, బెజ్జూర్, సిర్పూర్(టి), దహేగాం మండలాల్లోని అటవీ ప్రాంతంలో పెద్దపులులు ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో శాఖాహార జంతువులు ఎక్కువగా ఉండడంతో పాటు నీటి వసతిని ఆధారంగా చేసుకుని స్థిరనివా సంగా మార్చుకున్నాయి. గ్రామాల సమీ పంలో ఉన్న విద్యుత్ తీగలతో వేటగాళ్లు వేటకు ఉపక్రమిస్తుండటంతో పెద్దపులికి ముప్పు తప్పేలా లేదు. ఆహారం కొరకు అడవి నుంచి బయటికి వచ్చే క్రమంలో పెద్దపులులు విద్యుత్ తీగలతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.