వాంకిడి మండలం సోనాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మచ్చగూడ (మహగవ్)కు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడంలేదు. దీంతో గ్రామస్తులు బావి నీటిపై ఆధారపడి జీవిస్తున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలంటే లక్ష వరకు ఖర్చవుతుంది. నిధులు లేక చేయడం లేదు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచని స్థితిలో గ్రామస్తులు ఉన్నారు.
సిర్పూర్ మండల కేంద్రంలోని అంగడిబజర్ ఏరియాలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో డ్రెయినేజీ చెత్తాచెదారంతో కంపు కొడుతోంది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రాకపోవడంతో జీపీ ట్రాక్టర్‌కు డీజిల్ పోయలేని పరిస్థితిలో అధికారులు ఉండడంతో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోతోంది.
బెజ్జూర్: జిల్లాలోని గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రత్యేక అధికారు ల పాలనలో సమస్యలు తిష్ట వేశాయి. పనుల నిర్వహణకు కార్యదర్శులు లక్షల్లో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అయినా నిధుల కొరత కారణంగా గ్రామాల్లో సమస్యలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ఇంతకాలం అప్పులు తెచ్చి పనులు చేపట్టాం.. ఇప్పటి నుంచి మావల్ల కాదని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. గ్రామాల్లో వీధిదీపాలు వెలగకపోయినా, ట్రాక్టర్లలో డీజిల్ లేకపోయినా, మోటారు మరమ్మతులకు వచ్చినా, పైపులైను లీకేజీలు, వాటర్ పైప్‌లైన్ లీకేజీ నిర్మాణాలు కార్యదర్శులు చేపట్టాల్సి ఉంటోంది. లేదంటే వాటి ఫలితం ప్రజలు అనుభవించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకాలం కార్యదర్శులు సొంతంగా ఖర్చు చేసినవి తిరిగి రాకపోగా, నగదు చెల్లించకుండా సామగ్రిని షాపు నిర్వాహకులు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంతో పనులన్నీ నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
నిధుల కొరత..
ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాల్సి ఉంది. పంచాయతీల్లో పాలకవర్గాలు లేనందున నిధులు విడుదల చేయలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కేంద్రం నిధులు సక్రమంగా విడుదలై ఉండేవి. కానీ ఆవేం లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఒక్కో అధికారికి మూడు పంచాయతీల బాధ్యతలను అప్పగించడంతో వారు చుట్టపుచూపుగా గ్రామాలకు వచ్చి వెళ్తున్నారు. దీంతో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది.
అప్పుల పాలవుతున్న కార్యదర్శులు
జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా 1,102 గ్రామాలు ఉన్నాయి 320 మంది కార్యదర్శులు ఉన్నారు. 130 మంది గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు ఉన్నారు. ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో డ్రెయినేజీల నిర్మాణం, మంచినీటి పైపులైన్లు, రోడ్లతో పాటు కొన్ని గ్రామాల్లో వీధిలైట్ల మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పంచాయతీల పాలన మొక్కుబడిగా సాగుతోంది. పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండగా, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పల్లెల్లో సమస్యలు పేరుకు పోతుడడంతో చేసేదేమీ లేక అప్పులు చేసి పైపులైన్ల లీకేజీలు, బోర్ల మరమ్మతు చేయిస్తున్నారు. సమస్యలపై పంచాయతీరాజ్ జిల్లా అధికారి భిక్షపతి గౌడ్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
పడకేసిన ప్రత్యేక ప్రాలన..
దెబ్బతిన్న రోడ్లు, మంచినీటి పైపులైన్లు, వీధిలైట్ల మరమ్మతులు, నూతన అభివృద్ధి పనులను చేపట్టకపోవడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. సర్పంచు ల పదవీకాలం ముగిసి 13 నెలలు గడిచినా ఇంతవరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో పంచాయతీల్లో పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా స్థానికంగా పంచాయతీ కార్యదర్శులపైనే భారం పడుతోంది. అభివృద్ధి పనులు పడకేశాయి. మరమ్మత్తులు అటకెక్కాయి. ఎప్పుడు చూసినా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు తాళాలే దర్శనమిస్తున్నాయి.