ఆసిఫాబాద్‌అర్బన్: స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనకు జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి 6, 7, 8 ఫారాల దరఖాస్తులు 5,481 వచ్చాయని తెలిపారు. 4,559 దరఖాస్తులను పరిష్కరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశామన్నారు. వివరాలు సక్రమంగా లేకపోవడంతో 369 దరఖాస్తులు తిరస్కరించామని పేర్కొన్నారు. మరో 553 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత పరిష్కరిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలు జాబితాను బూత్‌స్థాయి ఏజెంట్లకు అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.