
బెట్టింగ్.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దీనిపైనే చర్చ సా
● చాపకింద నీరులా విస్తరిస్తున్న జూదం ● బానిసలుగా మారుతున్న యువత ● ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో అప్రమత్తత అవసరం ● ఏటా రూ.లక్షల్లో సాగుతున్న దందా
అంతా ‘స్మార్ట్’గానే..
జిల్లాలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, కౌటాల, తిర్యాణి, రెబ్బెన, వాంకిడి, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్ మండలాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో యువత సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ పెడుతున్నారు. రాష్ట్రంలో నిషేధిత యాప్‌ల ద్వారా ఈ బెట్టింగ్ దందా నడుస్తోంది. దాదాపు 75 వెబ్‌సైట్లు, యాప్‌లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉండటంతో ఫోన్‌లో ఫేక్ జీపీఎస్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని లొకేషన్ మార్చుకుంటున్నారు. హర్యానా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు లొకేషన్ మార్చి యాప్‌లు వినియోగిస్తున్నారు. జట్టులో ఆటగాళ్ల ఆటతీరు.. చివరిగా మ్యాచ్ గెలిచేదెవరు..? అని అనేక అంశాలపై రూ.వేల నుంచి రూ.లక్షల వరకు బెట్టింగ్ కాస్తున్నారు. యువకులతోపాటు చిరు వ్యాపారులు సైతం ఈ మోజులో పడి అప్పుల పాలవుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాగే ఈ బెట్టింగ్ దందా.. ఇప్పుడు జిల్లాలోని పల్లెలకు పాకడం కలవరపెడుతోంది. సెల్‌ఫోన్‌లోనే యాప్‌ల ద్వారా ఆడుతూ యూపీఐ ఐడీలతో డబ్బులు బదిలీ చేస్తున్నారు. తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలు సైతం అనుసంధానం చేయడం ద్వారా వారిని సైతం సమస్యల్లోకి నెడుతున్నారు.
కౌటాల(సిర్పూర్): క్రికెట్ అంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఆట. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఐపీఎల్ మరింత క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను కొందరు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో యువత, ఉద్యోగులు, విద్యార్థులు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల సాయంతో ఇంటి నుంచే పందెం కాసేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఢిల్లీ, ముంబాయి, బెంగుళూర్, హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన ఈ భూతం కొన్నేళ్లుగా జిల్లాలోనూ చాపకింద నీరులా విస్తరించింది. తెలిసీతెలియక చాలా మంది ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి అప్పుల పాలవుతున్నారు.
గతంలో సంఘటనలు
గతంలో క్రికెట్ బెట్టింగ్‌కు జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్‌కు చెందిన కొంతమంది బెట్టింగులకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన సందర్భాలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం కౌటాల మండలం ముత్తంపేట గ్రామంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు బెట్టింగ్‌రాయుళ్లు ఔరంగబాద్‌కు చెందిన వ్యక్తితో ఓ వైబ్‌సైట్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేయడంతోపాటు రెండు ఫోన్లు, రూ.10,050 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాగజ్‌నగర్ పట్టణంలో బెట్టింగ్‌కు పాల్ప డిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కళాశాలల విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎక్కువ ఈ భూతం బారిన పడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ల ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలి. డబ్బు ఖర్చుపెడుతున్న తీరును అడిగి తెలుసుకోవాలి. పెద్దమొత్తంలో డబ్బులు అడిగినప్పుడు ఆరా తీయాలి. పెడదారిన వెళ్తున్నట్లు గమనిస్తే కౌన్సిలింగ్ ఇప్పించాలి.
నిఘా ఉంచాం
క్రికెట్ బెట్టింగ్‌పై నిఘా ఉంచాం. గతంలో పలువురిపై కేసులు నమోదు చేశాం. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. పిల్లలకు అవసరం మేరకు మాత్రమే తల్లిదండ్రులు డబ్బులివ్వాలి. బెట్టింగ్‌పై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన యాప్‌ల్లో బెట్టింగ్‌లకు పాల్పడితే పట్టుబడితే శిక్ష తప్పదు. ఎవరైనా బెట్టింగ్ పెడుతున్నట్లు తెలిస్తే పోలీసులు, డయల్ 100కు సమాచారం ఇవ్వండి. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.
– డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ

బెట్టింగ్.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దీనిపైనే చర్చ సా