● షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన రావి శ్రీనివాస్
కౌటాల(సిర్పూర్): ‘నాది ఆవేశం కాదని, ఆవేదన’ అని సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి రావి శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఇటీవల రావి శ్రీనివాస్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన వివరణ పత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇద్దరు, ముగ్గురు నాయకులు మంత్రి సీతక్కకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపానని, నాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ఈర్షలేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల నుంచి పెరుగుతున్న ఫిర్యాదుల మేరకు ఎమ్మెల్సీ దండె విఠల్‌కు వివరణ తెలపాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లానని, నాకు వేరే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా కొత్త, పాత నాయకుల మధ్య సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, నాయకులు పాల్గొన్నారు.