● స్పర్శ్ పేరిట ‘కుష్ఠు’ అవగాహన కార్యక్రమాలు ● ఈ నెల 17 నుంచి 30 వరకు నిర్వహణ ● వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు ప్రత్యేక సర్వే
జిల్లాలో వ్యాధిగ్రస్తుల వివరాలు
ఆసిఫాబాద్‌అర్బన్: అవగాహన లేక కుష్ఠు వ్యాధి క్రమంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు స్పర్శ్ పేరిట జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ‘కలిసి అవగాహన పెంచుకుందాం.. అపోహలను దూరం చేద్దాం, కుష్ఠువ్యాధి బారిన పడిన ఎవరూ వెనుకబడి పోకుండా చూసుకొందాం’ అనే నినాదంతో అధికారులు పనిచేస్తున్నారు. పోస్టర్లు, ఫ్లాష్ కార్డులు, ఇతర కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
చర్మానికి సోకే వ్యాధి
మైకో బ్యాక్టీరియా లెప్రె ద్వారా చర్మం, నరాలకు సోకే అతి సాధారణ వ్యాధి కుష్ఠు. ఇంక్యూబేషన్ కాలం సగటున మూడేళ్లు పడుతుండటంతో లక్ష్యణాలు బహిర్గతమయ్యేందుకు ఆలస్యమవుతుంది. వంశపారపర్యంగా ఈ వ్యాధి సోకదు. ఆరు నుంచి 12 నెలలపాటు బహుళ ఔషధ చికిత్స ద్వారా వ్యాధిని నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. చర్మపు రంగు కంటే తక్కువ, ఎరుపు, లేదా రాగి రంగులో మచ్చలు ఉంటే వెంటనే వైద్యులు సంప్రదించాలని సూచిస్తున్నారు. కాళ్లు, చేతుల నరాల్లో వాపు, నొప్పి, తిమ్మిర్లు, ముఖం, చెవి బయట నూనె పూసినట్లు మెరుస్తున్నా, కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోయినా, వేళ్లు స్పర్శ కోల్పోయినా ఆశ్రద్ధ చేయొద్దు.
ముందుకు రాని బాధితులు
జిల్లా వైద్యారోగ్యశాఖ, కుష్ఠు నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఏటా బాధితుల గుర్తిపు కోసం ఇంటింటి సర్వే చేసి, మందులు పంపిణీ చేస్తున్నారు. అయితే చాలా మంది అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదు. వ్యాధిబారిన పడినా పరీక్షలు చేయించుకోవడం లేదు. గతేడాది చేపట్టిన సర్వే 88 మంది బాధితులను గుర్తించగా, ప్రస్తుతం చేపట్టిన సర్వే ఆరుగురికి వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. అంటువ్యాధి కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
వైద్యసిబ్బందికి సహకరించాలి
జిల్లాలో ఈ నెల 30 వరకు ప్రజలకు కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పిస్తాం. ఇప్పటివరకు జిల్లాలో ఆరుగురికి వ్యాధి నిర్ధారించారు. ప్రజలు వైద్యసిబ్బందికి సహకరించి.. లక్షణాలు ఉంటే నిర్భయంగా తెలపాలి. చికిత్స ద్వారా బాధితులు పూర్తిగా కోలుకోవచ్చు.
– శ్యాంలాల్, జిల్లా కుష్ఠు ప్రోగ్రాం అధికారి
సంవత్సరం గుర్తించిన వ్యాధిగ్రస్తులు
2020– 21 35
2021– 22 52
2022– 23 137
2023– 24 84
2024– 25 88
అవగాహన ఉంటేనే కట్టడి!